ఇళ్లను కూల్చివేయడంతో రోడ్డున పడ్డ కుటుంబాలు
సాక్షి, హైదరాబాద్: ‘అర్ధరాత్రి మిడతల దండులా మా ఇళ్ల మీద పడ్డారు. ఇంట్లోవాళ్లని బయటకు లాగి, సామాన్లను బయటపడేసి ఇండ్లు కూల్చేశారు. ఫ్యాన్లు, ఏసీలు అలాగే ఉన్నాయి. ఇంటిలోపల ద్విచక్రవాహనాలు కూడా ఉన్నాయి. ఇళ్లు మొత్తం నేలమట్టం చేసి రోడ్డునపడేశారు. మేము ఎక్కడకు వెళ్లాలి.. మా ఉసురు తగులుతుంది’.. అని ఎర్రమంజిల్ వాసులు అధికారులపై దుమ్మెత్తిపోశారు.
ఎర్రమంజిల్ రవీంద్రనికేతన్ పాఠశాల సమీపంలో ఉన్న సుమారు 30 ఇళ్లను మంగళవారం అర్ధరాత్రి వందలకొద్ది రెవెన్యూ, జీహెచ్‌ఎంపీ, పోలీస్, ఆర్‌అండ్‌బీ అధికారులు వచ్చి కూల్చివేశారు. 50 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. ప్రభుత్వం జీవో నెంబర్ 58 కింద మాకు పట్టాలు కూడా ఇచ్చింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, మాకు ప్రత్యామ్యాయం ఏమీ చూపకుండా ఎలా కూల్చేవేస్తారని అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు.
బుధవారం బాధితులంతా కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం నంండి సంబంధిత అధికారులందరికీ నోటీసులు పంపించారు. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రెవెన్యూ అధికారులు వచ్చి అరగంటలో ఇండ్లు ఖాళీ చేయాలని కూల్చివేస్తామని వారికి చెప్పడంతో సమాచారం అందుకున్న టీపీసీసీ ప్రధానకార్యదర్శి, కార్పొరేటర్ పి.విజయారెడ్డి అక్కడకు వచ్చి వారికి మద్దతుగా అక్కడే బైఠాయించించారు. సాయంత్రం వరకు అక్కడే ఆమె ఉన్నారు.
రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒకేసారి వందల కొద్ది పోలీసులు నలుగురు తహశీల్దార్లు, ఆర్‌డీవో, పెద్దెత్తున రెవెన్యూ అధికారులు అక్కడకు వచ్చి ప్రతీ ఇంట్లోకి వెళ్లడం అక్కడ కరెంట్ తీసేయ్యడం, ఇంట్లో ఉన్నవారిని బయటకు లాగి, చేతికి దొరికిన సామాన్లు బయటపడేసి రెండు జేసీబీలతో ఇండ్లు మొత్తం కూల్చేశారు. ఫ్యాన్లు, ఏసీలు అలానే ఇంట్లోనే కూరుకుపోయాయి. చాలా ఇండ్లల్లో పెట్టుకున్న ద్విచక్రవాహనాలు కూడా మట్టిలోనే కూరుకుపోయాయి.
విషయం తెలుసుకున్న కార్పొరేటర్ విజయారెడ్డి అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో అక్కడకు వచ్చి వారిని అడ్డుకునేందుకు యత్నించించారు. అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు, కొంతమంది బాధితులు, విజయారెడ్డి అనుచరులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మరీ.. ఇంత దారుణమా
అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో మేము గాఢ నిద్రలో ఉన్నాము. తలుపులు తట్టగా బయటకు వచ్చేసరికి 40 మంది ఉన్నారు. బయటకు రావాలి.. ఇళ్లుకూల్చేస్తున్నామని ఒకరు మాట్లాడుతుంటేనే మరొకరు కరెంట్ కట్‌చేశారు.
మరొకరు టార్చ్‌లైట్ తీసుకుని నన్ను బయటకు ఈడ్చేశారు. మా బాబు ఉన్నాడు అని చెబితే మరొకరు వెళ్లి ఐదునెలల తన బాబును తీసుకువచ్చి నా చేతిలో ఉంచి ఇల్లు కూల్చేశారు.మరీ ఇంత దారుణమా.
– శిరీష
కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు
ఇంట్లో పెద్దవారి మందులు ఉన్నాయి. పిల్లల పుస్తకాలు ఉన్నాయి వాటిని తీసుకుంటామన్నా వినలేదు. మాకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ప్రత్యామ్యాయం చూపకుండా బయటకు గెంటేస్తే ఎలా జీవో 58 ప్రకారం మాకు పట్టా కూడా ఇచ్చారు.
– మల్లీశ్వరి
రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లోనే మహిళా కార్పొరేటర్
ఎర్రమంజిల్ కాలనీ రామకృష్ణానగర్‌లో ఇళ్లు కూల్చడాన్ని అడ్డుకున్న ఖైరతాబాద్ కార్పొరేటర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ పి.విజయారెడ్డిని పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అరెస్టుచేసి స్టేషన్‌కు ఎస్‌ఆర్ నగర్ స్టేషన్‌తీసుకెళ్లారు. ఆమెను బుధవారం ఉదయం 10 గంటల తరువాత వదిలి పెట్టారు. మహిళ అని చూడకుండా తనను రాత్రంతా స్టేషన్‌లో ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. విజయారెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుంతరావు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment