IRRAMMANZIL
-
మరీ.. ఇంత దారుణమా.. రాత్రికి రాత్రే కూల్చేశారు..
సాక్షి, హైదరాబాద్: ‘అర్ధరాత్రి మిడతల దండులా మా ఇళ్ల మీద పడ్డారు. ఇంట్లోవాళ్లని బయటకు లాగి, సామాన్లను బయటపడేసి ఇండ్లు కూల్చేశారు. ఫ్యాన్లు, ఏసీలు అలాగే ఉన్నాయి. ఇంటిలోపల ద్విచక్రవాహనాలు కూడా ఉన్నాయి. ఇళ్లు మొత్తం నేలమట్టం చేసి రోడ్డునపడేశారు. మేము ఎక్కడకు వెళ్లాలి.. మా ఉసురు తగులుతుంది’.. అని ఎర్రమంజిల్ వాసులు అధికారులపై దుమ్మెత్తిపోశారు. ఎర్రమంజిల్ రవీంద్రనికేతన్ పాఠశాల సమీపంలో ఉన్న సుమారు 30 ఇళ్లను మంగళవారం అర్ధరాత్రి వందలకొద్ది రెవెన్యూ, జీహెచ్ఎంపీ, పోలీస్, ఆర్అండ్బీ అధికారులు వచ్చి కూల్చివేశారు. 50 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. ప్రభుత్వం జీవో నెంబర్ 58 కింద మాకు పట్టాలు కూడా ఇచ్చింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, మాకు ప్రత్యామ్యాయం ఏమీ చూపకుండా ఎలా కూల్చేవేస్తారని అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. బుధవారం బాధితులంతా కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం నంండి సంబంధిత అధికారులందరికీ నోటీసులు పంపించారు. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రెవెన్యూ అధికారులు వచ్చి అరగంటలో ఇండ్లు ఖాళీ చేయాలని కూల్చివేస్తామని వారికి చెప్పడంతో సమాచారం అందుకున్న టీపీసీసీ ప్రధానకార్యదర్శి, కార్పొరేటర్ పి.విజయారెడ్డి అక్కడకు వచ్చి వారికి మద్దతుగా అక్కడే బైఠాయించించారు. సాయంత్రం వరకు అక్కడే ఆమె ఉన్నారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒకేసారి వందల కొద్ది పోలీసులు నలుగురు తహశీల్దార్లు, ఆర్డీవో, పెద్దెత్తున రెవెన్యూ అధికారులు అక్కడకు వచ్చి ప్రతీ ఇంట్లోకి వెళ్లడం అక్కడ కరెంట్ తీసేయ్యడం, ఇంట్లో ఉన్నవారిని బయటకు లాగి, చేతికి దొరికిన సామాన్లు బయటపడేసి రెండు జేసీబీలతో ఇండ్లు మొత్తం కూల్చేశారు. ఫ్యాన్లు, ఏసీలు అలానే ఇంట్లోనే కూరుకుపోయాయి. చాలా ఇండ్లల్లో పెట్టుకున్న ద్విచక్రవాహనాలు కూడా మట్టిలోనే కూరుకుపోయాయి. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ విజయారెడ్డి అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో అక్కడకు వచ్చి వారిని అడ్డుకునేందుకు యత్నించించారు. అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు, కొంతమంది బాధితులు, విజయారెడ్డి అనుచరులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరీ.. ఇంత దారుణమా అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో మేము గాఢ నిద్రలో ఉన్నాము. తలుపులు తట్టగా బయటకు వచ్చేసరికి 40 మంది ఉన్నారు. బయటకు రావాలి.. ఇళ్లుకూల్చేస్తున్నామని ఒకరు మాట్లాడుతుంటేనే మరొకరు కరెంట్ కట్‌చేశారు. మరొకరు టార్చ్‌లైట్ తీసుకుని నన్ను బయటకు ఈడ్చేశారు. మా బాబు ఉన్నాడు అని చెబితే మరొకరు వెళ్లి ఐదునెలల తన బాబును తీసుకువచ్చి నా చేతిలో ఉంచి ఇల్లు కూల్చేశారు.మరీ ఇంత దారుణమా. – శిరీష కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు ఇంట్లో పెద్దవారి మందులు ఉన్నాయి. పిల్లల పుస్తకాలు ఉన్నాయి వాటిని తీసుకుంటామన్నా వినలేదు. మాకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ప్రత్యామ్యాయం చూపకుండా బయటకు గెంటేస్తే ఎలా జీవో 58 ప్రకారం మాకు పట్టా కూడా ఇచ్చారు. – మల్లీశ్వరి రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లోనే మహిళా కార్పొరేటర్ ఎర్రమంజిల్ కాలనీ రామకృష్ణానగర్‌లో ఇళ్లు కూల్చడాన్ని అడ్డుకున్న ఖైరతాబాద్ కార్పొరేటర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ పి.విజయారెడ్డిని పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అరెస్టుచేసి స్టేషన్‌కు ఎస్ఆర్ నగర్ స్టేషన్‌తీసుకెళ్లారు. ఆమెను బుధవారం ఉదయం 10 గంటల తరువాత వదిలి పెట్టారు. మహిళ అని చూడకుండా తనను రాత్రంతా స్టేషన్లో ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. విజయారెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుంతరావు పరామర్శించారు. -
300 మందికి 8 అంతస్తులా?
*ఎర్రమంజిల్‌లోని ఆర్అండ్బీ భవనంపై ఆ శాఖ కార్యదర్శి విస్మయం *'సాక్షి' కథనంతో అత్యవసర భేటీ నిర్వహించిన సునీల్‌శర్మ * రాష్ట్ర విభజనకు ముందు తీసుకున్న నిర్ణయాలపై ఆరా * పూర్తి వివరాలు, పత్రాలు అందజేయాలని అధికారులకు ఆదేశం * దీనిపై సీఎంకు నివేదిక అందించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అక్కడ పనిచేసే విభాగాధిపతులు ఆరుగురు... వారి ఆధీనంలో పనిచేసే సిబ్బంది మూడొందలు.. కానీ వారికోసం లక్ష చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంతో ఎనిమిది అంతస్తుల భవనం సిద్ధమవుతోంది. రూ. 67 కోట్లతో నిర్మిస్తున్న ‘అంత పెద్ద భవనంలో మేమేం చేస్తాం..’ అని స్వయంగా ఆ విభాగం అధికారులే ప్రశ్నించే పరిస్థితి. రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ విభాగం కోసం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో నిర్మిస్తున్న భవనం వ్యవహారం ఇది. ఈ భవనం నిర్మాణంలో అధికారుల ఇష్టారాజ్యం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ‘20 కోట్లతో మొదలై 67 కోట్లకు..’ శీర్షికతో ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితం కావటంతో రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి సునీల్‌శర్మ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం 300 మంది సిబ్బంది ఉండే చోట ఇంత పెద్ద భవనం నిర్మించాల్సిన పరిస్థితి, తొలుత ఐదంతస్తులుగా తలపెట్టి తర్వాత ఎనిమిది అంతస్తులకు పెంచుతూ నిర్ణయం తీసుకోవటానికి దారితీసిన పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, పత్రాలను తనకు అందజేయాల్సిందిగా ఆయన ఆర్అండ్బీ బిల్డింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. దీనిపై ముఖ్యమంత్రికి నివేదిక అందజేయనున్నట్టు తెలిసింది. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే... ఈ భవనం పనులు పూర్తయ్యేలోపు దాని అంచనాను మరోసారి సవరించే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతమున్న అంచనా రూ. 67 కోట్లకు పెంచాలనే ప్రతిపాదన 2014లో చేసింది. కానీ ఇప్పుడు పనులు పూర్తి కావటానికి మరికొన్ని నెలలు పడుతుంది. ఈలోపు నిర్మాణ సామగ్రి ధరలో మార్పులు వస్తాయి. దీంతో అంచనాను మరోసారి సవరించాల్సి ఉంటుందనే తీరులో అధికారులు చెబుతుండడం గమనార్హం. విభజన ముంగిట నిర్ణయం.. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా ఆర్అండ్బీ భవనంలో దాదాపు ఏడు వందల మందికి పైగా సిబ్బంది పనిచేశారు. విభజనతో తెలంగాణ వాటా మూడొందలకు తగ్గిపోయింది. 2009లో ఈ భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఐదంతస్తులుగా ప్రణాళిక రూపొందించారు. దానిని 2012లో ఎనిమిది అంతస్తులకు మార్చి... అంచనా వ్యయాన్ని రూ. 20 కోట్ల నుంచి రూ. 39 కోట్లకు పెంచారు. అప్పటికే రాష్ట్ర విభజన అంశం కొలిక్కివచ్చే తరుణంలో ఉంది. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చింది. రాష్ట్రం విడిపోతే తొలుత నిర్ణయించినట్టుగా ఐదంతస్తుల భవనం కూడా ఎక్కువే. అలాంటిది ఆగమేఘాల మీద అంచనా వ్యయాన్ని పెంచి ఎనిమిది అంతస్తులుగా నిర్మించాలని నిర్ణయించటం పట్ల ఇప్పుడు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఆ తర్వాత అదనపు పనుల పేరుతో అంచనా వ్యయాన్ని రూ. 67 కోట్లకు పెంచేశారు. ఇతర అవసరాలకు వినియోగిస్తే.. ఇంత భారీ భవనం ఆర్‌అండ్‌బీకి అనవసరమనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ భవనంలోనే ఆర్అండ్బీ కార్యదర్శి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించారు. కానీ ఛాతీ ఆసుపత్రి స్థలంలో కొత్తగా సచివాలయం ఏర్పాటుచేసే యోచనలో ఉన్నందున... ఆర్అండ్బీ మంత్రి కార్యాలయం వద్దే కార్యదర్శి కార్యాలయం కూడా ఏర్పటవుతుంది. అదే జరిగితే ఈ కొత్త భవనంలో దాని అవసరం ఉండదు. అలాంటప్పుడు దీన్ని రోడ్లు, భవనాల శాఖకు కాకుండా ఇతర అవసరాలకు వాడితే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. టీహైకోర్టు కోసం ఈ భవనాన్ని విని యోగిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం.