సాక్షి, హైదరాబాద్: సమ్మె సమయంలో మృతిచెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉద్యోగావకాశం కల్పించిన నేపథ్యంలో వారికి సంస్థ శిక్షణను ప్రారంభించింది. మొత్తం 38 మందికిగాను ఖమ్మంకు చెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి కుటుంబసభ్యులు ఉద్యోగం బదులు నగదు సాయం కోరారు. మిగతా 37 మందిలో నలుగురు వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. మిగతావారికి హకీంపేటలోని ఆర్టీసీ శిక్షణా కేంద్రంలో బుధవారం నుంచి శిక్షణ ప్రారంభించారు. అంతకుముందు వారితో ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ బస్‌భవన్‌లో భేటీ అయ్యారు. అక్కడే శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉద్యోగుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
సమ్మె సమయంలో అంతమంది ఉద్యోగులు చనిపోవటం కలిచివేసిందన్నారు. కొత్తగా సంస్థలోకి వస్తున్న వీరికి చక్కటి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం నాటికి ఉద్యోగులు అంతా బోనస్ తీసుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవటం పెను విషాదంగా పేర్కొన్నారు. వారిని అధికారులు ఓదార్చారు. జూనియర్ అసిస్టెంట్స్‌కు 13 వారాలు, కండక్టర్లకు 3 వారాలు, సెక్యూ రిటీ కానిస్టేబుల్స్‌కు 8 వారాలు, శ్రామిక్‌లకు 2 వారాలపాటు శిక్షణ ఇవ్వనున్నారు.
మీ ఆర్టీసీ ఎలాగుంది..?
పరిశీలనకు రాజస్థాన్ ఆర్టీసీ అడ్వైజర్
సాక్షి, హైదరాబాద్: నష్టాల కుప్పగా మారి, సమ్మెతో అతలాకుతలమై, తిరిగి గాడిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న మన ఆర్టీసీ పరిస్థితిని ఇప్పుడు రాజస్తాన్ ఆర్టీసీ అధ్యయనం చేయబోతోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ రవాణా సంస్థలు తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు చవిచూస్తున్నాయి. చిన్న ఆర్టీసీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ బస్సులతో ఉన్న రాజస్తాన్ ఆర్టీసీ టీఎస్‌ఆర్టీసీని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇక్కడ అనుసరిస్తున్న తీరును తెలుసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్టీసీ ఫైనాన్స్ అడ్వైజర్ గుప్తా గురు, శుక్రవారాల్లో టీఎస్‌ఆర్టీసీ అధికారులతో భేటీ కాబోతున్నారు. సమ్మెతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకునేందుకు ఆర్టీసీ శ్రమిస్తున్న సమయంలో ఈ అధ్యయనానికి రానుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment