![TSRTC Employees Salary Deposit In Bank Accounts October 1st - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/1/TSRTC-Employees.jpg.webp?itok=y9VPj68a)
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు దాదాపు మూడేళ్ల తర్వాత ఒకటో తేదీనే జీతాలు అందనున్నాయి. ఇన్నాళ్లు పది, పదిహేను రోజులు ఆలస్యంగా వేతనాలు ఇవ్వగా ఒకటో తేదీనే చెల్లించేలా సంస్థ ఎండీ సజ్జనార్ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అక్టోబర్ నుంచి ఒకటిన అంటే శుక్రవారమే ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమకానున్నాయి. వాస్తవానికి 2018 డిసెంబర్ వరకు ఆర్టీసీ ఉద్యోగులు/కార్మికులు ప్రతినెలా ఒకటో తేదీకి అటూఇటుగా వేతనాలు పొందుతూ వచ్చారు. కానీ సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో తర్వాత జీతాలు ఇవ్వడమే గగనంగా మారింది.
గ్రేటర్ హైదరాబాద్ జోన్, బస్‌భవన్ ఉద్యోగులకైతే సెప్టెంబర్‌లో 20వ తేదీన వేతనాలు అందాయి. ఉద్యోగులు ఈఎంఐలు, ఇతర ఖర్చుల కోసం ఇబ్బందిపడక తప్పలేదు. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ విషయంపై దృష్టిపెట్టారు. దీనిపై బ్యాంకులతో చర్చించారు. ప్రతినెలా ఒకటో తేదీలోపు రూ.100 కోట్ల ఓవర్‌డ్రాఫ్టు ఇవ్వాలని.. డిపోల్లో రోజువారీ టికెట్ కలెక్షన్ ఖాతాలను సదరు బ్యాంకులో తెరుస్తామని ప్రతిపాదించారు. దీనికి ఓ ప్రభుత్వరంగ బ్యాంకు ముందుకొచ్చి.. అక్టోబర్ ఒకటిన జీతాల చెల్లింపు కోసం రూ.100 కోట్లు అందించింది. టికెట్ల ఆదాయం నుంచిగానీ, ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం నుంచిగానీ తిరిగి ఈ సొమ్మును బ్యాంకుకు చెల్లించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment