సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీకి ఇచ్చిన హామీలను వారం పది రోజుల్లోగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉద్యోగుల సంక్షేమ బోర్డు కార్యలాపాలను ఈవారంలోనే ప్రారంభించాలని సూచించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. డిపో స్థాయి, రీజియన్, కార్పొరేషన్ స్థాయిలో ఉద్యోగ సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందున వాటి విధివిధానాలను ఖరారు చేయాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా బస్సులను హేతుబద్ధీకరించాలని, తద్వారా తక్కువ మంది ప్రయాణికులతో బస్సులు తిరిగే పరిస్థితిని నివారించాలన్నారు. పెరిగిన చార్జీల ద్వారా గరిష్ట ఆదాయం పొందేలా షెడ్యూల్ ఉండాలని పేర్కొన్నారు. మహిళా సిబ్బందికి కొత్త యూనిఫాం ఆప్రాన్లను అందించాలన్నారు. సిబ్బంది ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాలను ఒక్కొక్కటిగా ఆయన సమీక్షించారు. వీటిపై త్వరలో సీఎం భేటీ నిర్వహించే అవకాశం ఉన్నందున ఈలోపు వాటిని అమల్లోకి తెచ్చేలా చూడాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment