మెట్రో రైల్ భవన్‌లో సునీల్ శర్మ నేతృత్వంలో జరిగిన సమీక్షకు హాజరైన ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: ఒకే టికెట్‌తో మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల్లో పయనించే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఆటోలు, ఓలా, ఉబెర్ క్యాబ్‌లో సైతం ఈ కాంబి టికెట్‌ను వినియోగించి పయనించవచ్చు. కామన్ మొబిలిటీ కార్డు (సీఎంసీ)గా పేర్కొనే ఈ టికెట్ పురోగతిపై మంగళవారం బేగంపేట్‌లోని మెట్రో రైల్ భవన్‌లో సమీక్ష జరిగింది. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ నాయక్ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనవరి నెలాఖరు వరకు కనీసం రెండు మెట్రో స్టేషన్‌ల్లో, అలాగే ఈ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించే 100 బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా సీఎంసీని ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రయాణికులు ట్రైన్ దిగిన వెంటనే తమకు అందుబాటులో ఉన్న ఇతర ప్రయాణ సాధనాల ద్వారా లాస్ట్‌మైల్ వరకు చేరుకునేందుకు ఈ కాంబి టికెట్ దోహదపడుతుంది.
ఇలా వినియోగించుకోవచ్చు...
ప్రస్తుతం వినియోగంలో ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డుల తరహాలోనే స్టేట్ బ్యాంక్ ఈ సీఎంసీలను అందుబాటులోకి తెస్తుంది. ఈ కార్డు ధర రూ.50 వరకు ఉంటుంది. ఒకసారి కార్డు కొనుగోలు చేసిన తరువాత తమ నెలవారీ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రూ.3,000 వరకు రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్డులు అన్ని చోట్ల లభిస్తాయి. బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ సెంటర్లు, తదితర అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు. సీఎంసీలను స్వైప్ చేసేందుకు మెట్రో రైళ్లు, బస్సులు, ఆటోలు, ఓలా, ఉబెర్ క్యాబ్‌లో ఇంటెలిజెన్స్ టిమ్స్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టు తర్వాత దశలవారీగా నగరమంతటా ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment