సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను జేఏసీ నేతలు తాత్కాలికంగా పక్కన పెట్టినా.. తిరిగి ఏ క్షణమైనా ఆ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చే అవకాశ ఉందని ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ అనుమానం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెపై శనివారం హైకోర్టుకు సునీల్ శర్మ ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు తమ సొంత ఉనికి కోసం సమ్మె చేస్తున్నారని, అలాంటి సమ్మెను అక్రమమైనదిగా ప్రకటించాలని అఫిడవిట్‌లో కోరారు. ఆర్టీసీ అర్థిక పరిస్థితి బాగాలేనందున కార్మికులకు ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చలేమని తేల్చిచెప్పారు. ఇక కార్మికుల డిమాండ్‌లను పరిష్కరించలేమని కోర్టుకు తెలిపిన సునీల్ శర్మ, మరోసారి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేమని స్పష్టం చేశారు.
సమ్మె కారణంగా ఇప్పటివరకు ఆర్టీసీ కార్పొరేషన్ 44 శాతం నష్టపోయిందని కోర్టుకు తెలిపారు. కొంతమంది యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం మొత్తం టీఎస్ ఆర్టీసీనే నష్టాల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లో నెట్టేందుకు యూనియన్ నేతలు పనికట్టుకున్నారని దుయ్యబట్టారు. పరిస్థితి చేయి దాటిపోతోందని, ఇప్పటికైనా సమ్మెను ఇల్లీగల్‌గా ప్రకటించాలని మరోసారి కోరుతున్నట్లు అఫిడవిట్లో సునీల్ శర్మ పేర్కొన్నారు. ఇక ప్రభుత్వంపై కుట్ర పూరితంగా వ్యవహరించేందుకే జేఏసీ నేతలు ప్రతిపక్షాలతో చేతులు కలిపారని ఆరోపించారు.
ఈ నెల 18న హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ అఫిడవిట్ దాఖలు చేశారు. కాగా, సమస్య పరిష్కారానికి హైకోర్టు సూచించిన తిసభ్య కమిటీని ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ ఎండీ తాజాగా దాఖలు చేసిన ఫైనల్ అఫిడవిట్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment