సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చ జరపాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయని కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామంటే వినలేదనీ, చర్చలు జరపకుండానే కార్మిక నేతలు బయటకు వెళ్లిపోయారని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. విలీనం డిమాండ్‌కు పట్టుబట్టకుండా మిగతా డిమాండ్లపై చర్చ జరపవచ్చు కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగతా వాటిపై చర్చించాలని కార్మిక సంఘాలకు సూచించింది. మొత్తం 45 డిమాండ్లలో ఆర్టీసీ సంస్థపై ఆర్థికభారం పడని డిమాండ్లపై చర్చ జరగాలని, మొదట 21డిమాండ్లపై చర్చ జరిగితే కార్మికుల్లో కొంత ఆత్మస్థైర్యం కలుగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఓవర్ నైట్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎలా సాధ్యమవుతుందని హైకోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగతా వాటిపై చర్చ జరపాలని, లేకపోతే సమ్మె విషయంలో ప్రతిష్టంభన కొనసాగి.. ఇటు కార్మికులు, అటు ప్రజలు ఇబ్బంది పడతారని న్యాయస్థానం పేర్కొంది. మరోవైపు కార్మిక సంఘాల తరఫు న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చర్చల విషయంలో హైకోర్టు ఆదేశాలను ఆర్టీసీ అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని పేర్కొన్నారు. కేవలం 21 డిమాండ్లపైనే చర్చిస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారని, ఇతర డిమాండ్లపై వారు చర్చించడం లేదని పేర్కొన్నారు.
చదవండి: ఆర్టీసీ సమ్మె: హైకోర్టు ఆగ్రహం.. ఏజీ రావాల్సిందే!
చదవండి: ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కీలక వివరణ కోరిన హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment