గృహ నిర్బంధంలో అశ్వత్థామరెడ్డి
సాక్షి, హైదరాబాద్/హస్తినాపురం: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె శనివారం స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. సమ్మె కార్యాచరణలో భాగంగా శనివారం బస్ రోకో చేపట్టారు. దీనికి అనుమతి లేదని, బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ముందే హెచ్చరించారు. అయినా కార్మికులు శనివారం ఉదయం నుంచే డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు జేఏసీ రాష్ట్ర నేతలు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టగా వారికి మద్దతుగా అన్ని డిపోల వద్ద కార్మికులు కూడా దీక్షలు నిర్వహించటంతో స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ కార్మికులను అరెస్టు చేశారు. ముఖ్యంగా జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని గృహానిర్బంధం చేయడంతోపాటు, కోకన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తిలు చేపట్టిన దీక్షలను భగ్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీక్షలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలపటంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. వారిని నిలవరించే క్రమంలో పోలీసులతో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.
అశ్వత్థామరెడ్డి గృహ నిర్బంధం...
సమ్మె కార్యాచరణలో భాగంగా శనివారం ధర్నా చౌక్ ఇందిరాపార్కు వద్ద నిరశన దీక్ష చేపట్టాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. అయితే దీనికి పోలీసులు అనుమతిత్వలేదు. దీంతో వీఎస్టీ సమీపంలోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఉదయం దీక్ష ఉండటంతో, దానిని భగ్నం చేసే క్రమంలో తెల్లవారుజామునే పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకోవాలని భావించారు. ఈ విషయం ముందుగానే ఊహించిన జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఇళ్ల వద్దకు రావాలంటూ అందుబాటులో ఉన్న కార్మికులకు సమాచారం అందించారు. హస్తినాపురం జయక్రిష్ణ ఎన్‌క్లేవ్‌లోని అశ్వత్థామరెడ్డి, రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాజిరెడ్డి ఇళ్ల వద్దకు శుక్రవారం అర్ధరాత్రి దాటాక పెద్ద సంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీక్షా శిబిరం వద్దకు బయలుదేరితే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి అశ్వత్థామరెడ్డి బయటకు రాకుండా ఇంట్లోనే తలుపు గడియపెట్టుకుని ఉండిపోయారు. ఆయనతోపాటు పలువురు ఆర్టీసీ కార్మికులు కూడా ఉన్నారు. దీంతో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఇంట్లోనే దీక్ష ప్రారంభిస్తున్నట్టు ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆయనతోపాటు మహిళా కార్మికులు కూడా దీక్షలో పాల్గొన్నారు. మహిళా కార్మికులను వెలుపలికి రావాల్సిందిగా పోలీసులు కోరినా వారు తిరస్కరించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు..
అశ్వత్థామరెడ్డి దీక్ష విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విలేకరులను తప్పించి ఎవరినీ ఆపార్ట్‌మెంట్‌లోని అనుమతించలేదు. దీంతో పోలీసులు దమనకాండ నిర్వహిస్తున్నారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. అక్కడికి వచ్చిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, సంధ్యలను అనుమతించలేదు. ఆగ్రహానికి గురైన మందకృష్ణ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో సంధ్య గేటు దూకి లోనికి వెళ్లేందకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
రెడ్డికాలనీలో ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు
రాజిరెడ్డి అరెస్టు.. విడుదల..
ఇదే సమయంలో రాజిరెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజిరెడ్డి వద్దకు పోలీసులు వెళ్లకుండా చుట్టూ మహిళా కార్మికులు వలయంగా ఏర్పడ్డారు. అయినా పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని, రాజిరెడ్డిని అరెస్టు చేసి పహడీషరీఫ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడే ఆయన దీక్షను కొనసాగించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రాజిరెడ్డిని విడిచిపెట్టారు. మరో కోకన్వీనర్ లింగమూర్తి సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి బొల్లారం స్టేషన్‌ను తరలించారు. అక్కడ ఆయన దీక్ష కొనసాగించారు.
సునీల్‌శర్మకు ఏం తెలుసు..?: అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి
ఆర్టీసీ నష్టాలను పదేపదే చెబుతున్న ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోంది. నష్టాలకు కారణమైన ప్రభుత్వమే సంస్థను నిర్వీర్యం చేసింది. 17 నెలల క్రితం ఎండీగా వచ్చిన సునీల్‌శర్మకు ఆర్టీసీ గురించి ఏం తెలుసు. ఇప్పటివరకు కనీసం ఏడు సార్లు కూడా ఆయన ఆర్టీసీ కార్యాలయానికి రాలేదు. ముఖ్యమంత్రి తయారు చేసిన అఫిడవిట్లపై సునీల్‌శర్మ సంతకాలు పెడుతున్నారు. వాటిని చూస్తే అధికారుల రూపొందించినట్టు లేవు. రాజకీయ పార్టీలు తయారు చేసినట్టే ఉన్నాయి. కోర్టులు చివాట్లు పెట్టినా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవటం లేదు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. సంస్థను మూసివేసేందుకు నష్టాల ముద్ర వేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌పై వెనక్కు తగ్గినా ప్రభుత్వం పట్టించుకోకపోవటమే దీనికి నిదర్శనం. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు దిగినా కార్మికులు భయపడలేదు, భయపడరు. సమ్మె కొనసాగుతుంది. మరింత ఉధృతమవుతుంది. ప్రశాంతంగా దీక్ష చేయబోతే, పోలీసులు 144 సెక్షన్‌తో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలతో చేతులు కలిపామన్న ఆరోపణలు అవాస్తవం. తీరు మారకుంటే భవిష్యత్తులో ప్రజా క్షేత్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి అవమానం తప్పదు.
కేరళ ఎంపీ సంఘీభావం..
రాజిరెడ్డి సహా పలువురు కార్మికులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకుని పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న కేరళ సీపీఐ ఎంపీ బినాయ్ విశ్వం కూడా అక్కడికి చేరుకుని సంఘీభావం తెలిపారు. కార్మికులను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించడం సరి కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న వ్యవహారం, ఇక్కడి ప్రభుత్వం తీరును పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానన్నారు. పోలీసు స్టేషన్ వద్ద మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష చేస్తే నాటి ప్రభుత్వం అనుమతించిందని, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల దీక్షకు మాత్రం అనుమతించకపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలన్నారు. ప్రభుత్వ వేధింపుల కారణంగా 27 మంది కార్మికులు చనిపోయారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు జరిపిన సమ్మె కారణంగానే రాష్ట్రం ఏర్పడిందని చెప్పిన కేసీఆర్.. ప్రస్తుతం వారి పట్ల నిరంకుశంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పోలీసులు కూడా మానవత్వంతో ఆలోచించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment