సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో తెలంగాణ ప్రభుత్వం కఠినమైన వైఖరిని అవలంబిస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటల్లోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని, ఒకవేళ వారు విధులకు హాజరుకాకపోతే.. వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబోమని మరోసారీ టీఎస్ సర్కారు తేల్చిచెప్పింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. విధుల్లో చేరని కార్మికులను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించబోదని ఆయన తెలిపారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగనిరీతిలో శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ముఖ్యంగా మూడు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలీస్తున్నదని పువ్వాడ చెప్పారు. మూడు నుంచి నాలుగు వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడపడం, ఆర్టీసీ బస్సులు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సు కలిగిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఉద్యోగావకాశం కల్పించడం.. వారికి తక్షణం తగు శిక్షణ ఇచ్చి, బస్సులను యధావిధిగా నడపడం తదితర చర్యలను తీసుకోనున్నట్టు ఆయన వివరించారు.
సమ్మెను ఎదుర్కోవడంలో భాగంగా ఆరు నుంచి ఏడు వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. శనివారం సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితిని ప్రభుత్వం గమనిస్తోందని, ఆదివారం ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి సమీక్షను ప్రభుత్వం నిర్వహించి.. ఆర్టీసీకి సంబంధించి ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తుందని ఆయన వెల్లడించారు. సమ్మెపై సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment