సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో విద్యా సంస్థలకు దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ వరకూ సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రగతి భవన్‌లో మంత్రులు, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సెలవుల పెంపుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బస్సు సర్వీసులను వంద శాతం పునరుద్ధరించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉండడంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
‘మూడు నాలుగు రోజుల్లోనే వంద శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. అప్పటి వరకు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల సెలవులను పొడిగిస్తున్నం. సిలబస్ నష్టపోకుండా భవిష్యత్తులో రెండో శనివారం విద్యా సంస్థలు నడపాలి. అవసరమైతే ఇతర సెలవులను తగ్గించుకోవాలి. 21వ తేదీ నుంచి అన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయి. బస్ పాస్ విషయంలో ఒక్క విద్యార్థి కూడా బాధ పడొద్దు. కాబట్టి బస్ పాసులున్న విద్యార్థులు యధావిధిగా తమ విద్యాసంస్థలకు వెళ్లవచ్చు’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment