Dassara Holidays
-
తెలంగాణలో దసరా సెలవులు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో విద్యా సంస్థలకు దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ వరకూ సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రగతి భవన్లో మంత్రులు, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సెలవుల పెంపుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బస్సు సర్వీసులను వంద శాతం పునరుద్ధరించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉండడంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘మూడు నాలుగు రోజుల్లోనే వంద శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. అప్పటి వరకు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల సెలవులను పొడిగిస్తున్నం. సిలబస్ నష్టపోకుండా భవిష్యత్తులో రెండో శనివారం విద్యా సంస్థలు నడపాలి. అవసరమైతే ఇతర సెలవులను తగ్గించుకోవాలి. 21వ తేదీ నుంచి అన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయి. బస్ పాస్ విషయంలో ఒక్క విద్యార్థి కూడా బాధ పడొద్దు. కాబట్టి బస్ పాసులున్న విద్యార్థులు యధావిధిగా తమ విద్యాసంస్థలకు వెళ్లవచ్చు’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. -
ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు
♦ ఆడుకుంటూ ఇరుకైన గోడల మధ్య చిక్కుకున్న బాలుడు ♦ వైఎస్సార్ జిల్లాలో నాలుగు గంటలు ఉత్కంఠ ♦ ఎట్టకేలకు రక్షించిన అగ్నిమాపక సిబ్బంది లక్కిరెడ్డిపల్లె: దసరా సెలవుల్లో దాగుడుమూతలాట ఓ పిల్లాడి ప్రాణాలు మీదికి తెచ్చింది. రెండు ఇళ్ల ఇరుకైన గోడల మధ్య నాలుగు గంటల పాటు ఇరుక్కుపోయిన ఆ బాలుడిని చివరకు అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం చింతకుంటవాండ్లపల్లెలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. గాలివీడు మండలం పూలుకుంట గ్రామానికి చెందిన ఫరూక్(6) దసరా సెలవులు కావడంతో రెండురోజుల క్రితం అమ్మమ్మగారి ఊరైన చింతకుంటవాండ్లపల్లెకు వచ్చాడు. గురువారం పిల్లలంతా కలసి దాగుడుమూతలాట ప్రారంభించారు. ఎవరికీ కనబడకుండా దాక్కోవాలని భావించిన ఫరూక్ సమీపంలోని రెండు ఇళ్ల గోడల మధ్య ఉన్న 20 అడుగుల పొడవైన ఇరుకైన సందులోకి వెళ్ళి ఇరుక్కుపోయాడు. దాదాపు 10 అడుగుల మేర లోపలికి వెళ్లిన అతను బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఏడుపు లంకించుకున్నాడు. బాలుడి ఏడుపు విన్న ఆ ఇళ్లలోని వారు అతని కుటుంబసభ్యులకు విషయం తెలియజేశారు. వారు స్థానికుల సహకారంతో పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. అగ్నిమాపక అధికారి గాబ్రియేల్ సిబ్బందితో పూలుకుంట చేరుకుని డ్రిల్లింగ్ మిషన్ సాయంతో ఓ ఇంటి గోడను తొలగిస్తూ వెళ్లి బాలుడ్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో 4 గంటలపాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అగ్నిమాపక సిబ్బందిని గ్రామస్తులందరూ అభినందించారు.