సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయమై హైకోర్టులో సోమవారం మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. అటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక సంఘాలకు నోటీసులు జారీచేసింది. అన్ని పిటిషన్లపై ఈ నెల 28న వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.
ఆర్టీసీ సమ్మె నేటితో 17వ రోజుకు చేరుకున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు తమ ఆందోళనను తీవ్రతరం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ రోజు (సోమవారం) సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలువనున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని, దీనిపై జోక్యం చేసుకోవాలని జేఏసీ ప్రతినిధులు గవర్నర్‌ను కోరనున్నట్టు సమాచారం.
సమ్మె మరింత ఉధృతం చేస్తాం
ఆర్టీసీ సమ్మెలో భాగంగా నగరంలోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) వద్ద ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన టీజేఎస్ చీఫ్ కోదండరాం ఆర్టీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకోవడమే లక్ష్యంగా తమ ఉద్యమం ఉంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి.. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరామ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment