
శనివారం అఖిలపక్ష నేతలతో కలసి మీడియాతో మాట్లాడుతున్న అశ్వత్థామరెడ్డి. చిత్రంలో తమ్మినేని, కోదండరాం, చాడ తదితరులు
సాక్షి, హైదరాబాద్ (సుందరయ్య విజ్ఞానకేంద్రం): సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు. నాలుగు కోట్ల మంది ప్రజల రవాణాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. శనివారం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి తెలంగాణ ఆర్టీసీ విడిపోలేదని, అందువల్ల సీఎం తీసుకునే అప్రజాస్వామిక నిర్ణయాలు చెల్లవని పేర్కొన్నారు. తమ కార్యాచరణలో భాగంగా ఢిల్లీ వెళ్లి ఈనెల 4, 5వ తేదీల్లో రాష్ట్రపతి కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వినతిపత్రం సమరి్పంచనున్నట్టు వెల్లడించారు. సీఎం మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. సీఎం మొండి వైఖరి విడనాడాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.
సీఎం నిర్ణయాలు చెల్లవు: కోదండరాం
ఏపీఎస్ ఆర్టీసీ నుంచి తెలంగాణ ఆర్టీసీ ఇంకా విడిపోనందున ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు చెల్లవని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. సర్కారు ప్రకటనలకు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. కోర్టును ధిక్కరించే ఇలాంటి ముఖ్యమంత్రిని తాను చూడలేదన్నారు. అసలు సీఎంకు చట్టం గురించి తెలుసా అని ప్రశ్నించారు. సంస్థను ప్రైవేటుపరం చేసే అధికారం ఆయనకు లేదని పేర్కొన్నారు. న్యూడెమోక్రసీ సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. సీఎంకు కారి్మక చట్టాలు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కోర్టుకు సైతం తప్పుడు నివేదికలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి, వాటి ఆస్తులను అమ్ముకునే కుట్రలో భాగంగానే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపించారు.
ఇదీ జేఏసీ కార్యాచరణ...
- మృతిచెందిన కార్మికులకు సంతాపంగా 3న అన్ని డిపోలు, మండలాలు, నియోజకవర్గాల్లో సమావేశాలు
- 4న రాజకీయ పార్టీలతో కలసి అన్ని డిపోల వద్ద ధర్నాలు
- 5న సడక్ బంద్‌లో భాగంగా రహదారుల దిగ్బంధనం
- 6న అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మిక కుటుంబాల నిరసన
- 7న అన్ని ప్రజా సంఘాలతో ప్రదర్శనలు
- 8న చలో ట్యాంక్‌బండ్ ముందస్తు సన్నాహక కార్యక్రమాలు
- 9న చలో ట్యాంక్‌బండ్, సామూహిక నిరసనలు
Comments
Please login to add a commentAdd a comment