
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లుపై చర్చించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో మంగళవారం ఉదయం 8 గంటలకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భేటీ కానుంది. కొద్దిరోజుల క్రితమే సచివాలయం నుంచి బిల్లు రాజ్‌భవన్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవలే గవర్నర్ ప్రకటించారు.
అసెంబ్లీ ఆమోదం పొంది నెలపైనే గడిచినందున వీలైనంత తొందరలో బిల్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదించి పంపాలని జేఏసీ కోరనుందని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వంలో విలీనం కంటే ముందే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆర్థిక అంశాలను ప్రభుత్వం పరిష్కరించేలా చూడాలని కూడా వారు కోరనున్నట్టు తెలిసింది. రెండు వేతన సవరణలుసహా మొత్తం 30 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్‌కు సమర్పించనున్నారు.