RTC worker
-
నేడు గవర్నర్‌తో ఆర్టీసీ జేఏసీ భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లుపై చర్చించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో మంగళవారం ఉదయం 8 గంటలకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భేటీ కానుంది. కొద్దిరోజుల క్రితమే సచివాలయం నుంచి బిల్లు రాజ్‌భవన్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవలే గవర్నర్ ప్రకటించారు. అసెంబ్లీ ఆమోదం పొంది నెలపైనే గడిచినందున వీలైనంత తొందరలో బిల్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదించి పంపాలని జేఏసీ కోరనుందని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వంలో విలీనం కంటే ముందే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆర్థిక అంశాలను ప్రభుత్వం పరిష్కరించేలా చూడాలని కూడా వారు కోరనున్నట్టు తెలిసింది. రెండు వేతన సవరణలుసహా మొత్తం 30 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్‌కు సమర్పించనున్నారు. -
మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య
జియాగూడ: మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని రాణిగంజ్–2 డిపోకు చెందిన కండక్టర్ సురేందర్ గౌడ్ (45)ఆదివారం రాత్రి కార్వాన్‌లోని బాంజవాడి తోటలోని తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో ప్లాస్టిక్ వైర్ తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గంట తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. 14 ఏళ్లుగా ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న సురేందర్.. ఇటీవల ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఉద్యోగం పోతుందేమోనన్న ఆందోళనతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సురేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
అవమాన భారం.. బలవన్మరణం
♦ సహచరుడు చెప్పుతో కొట్టాడని ఉరి వేసుకున్న ♦ ఆర్టీసీ కార్మికుడు ఫిర్యాదును పోలీసులు ♦ పట్టించుకోక పోవడంతో తీవ్ర ఆవేదన ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో గ్యారేజీలో శ్రామిక్‌గా పని చేస్తున్న ధనిరెడ్డి కొండారెడ్డి (47) శనివారం వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుని కుమిలిపోయిన ఆయన చివరకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అతను డిపోలో ఐదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం గ్యారేజీలో టైర్ల సెక్షన్లో పని చేస్తున్న కొండారెడ్డి పని ముట్లు కనిపించలేదని అక్కడే ఉన్న కార్మికులను అడిగాడు. వారు మెకానిక్ రామచంద్రుడు తీసుకెళ్లినట్లు చెప్పారు. కొద్ది సేపటి తర్వాత కనిపించిన పనిముట్లకు గ్రీసు, ఆయిల్ పూసి ఉండటంతో ఇలా చేస్తే ఎలా అని కొండారెడ్డి ప్రశ్నించాడు. దీంతో రామచంద్రుడు.. కొండారెడ్డితో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయాన్ని ఎంఎఫ్ మద్దిలేటి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సర్ది చెప్పారు. ఎంఎఫ్‌కు తనపై ఫిర్యాదు చేస్తావా? అని కొండారెడ్డిని.. తన అనుచురులు పట్టుకోగా రామచంద్రుడు చెప్పుతో కొట్టాడు. కొండారెడ్డి అక్కడే ఉన్న టైర్ రింగ్ తీసుకొని రామచంద్రుడిపైకి విసిరాడు. అతనికి గీకుడు గాయమైంది. దీంతో రామచంద్రుడు.. కొండారెడ్డి తనను కొట్టాడని జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టులో ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు అదే రోజు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని కొండారెడ్డి తీవ్ర ఆవేదనతో యూనియన్ నాయకులు ఎన్ఆర్.శేఖర్, సీఆర్ఎస్.రెడ్డి, మాచయ్య దృష్టికి తీసుకెళ్లారు. కొండారెడ్డి ఫిర్యాదు చేసినా తీసుకోని పోలీసులు.. గురువారం కొండారెడ్డితోపాటు యూనియన్ నాయకులు మాచయ్య, మరికొందరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ అధికారులు ఎవ్వరూ లేక పోవడంతో తిరిగి శుక్రవారం వెళ్లారు. అయితే కొండారెడ్డి ఫిర్యాదును ఎస్ఐ ఆంజనేయులు తీసుకోలేదు. దీంతో వారు వెనుదిరిగారు. ఈ విషయాన్ని కొండారెడ్డి భార్య సులోచనకు శుక్రవారం రాత్రి చెప్పి కన్నీటి పర్యంతమయ్యాడు. ఆమె ఓదార్చినా అతని వేదన తీరలేదు. శనివారం యథావిధిగా విధులకు వచ్చాడు. మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో గ్యారేజీలో ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యారేజీలో 40 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. వారు భోజనానికి వెళ్లారు. కొండారెడ్డి అఘాయిత్యానికి పాల్పడిన సమయంలో ఎవరూ లేరని అధికారుల విచారణలో తేలింది. చెట్టుకు వేలాడుతున్న కొండారెడ్డిని గ్యారేజీలోకి వచ్చిన కొందరు కార్మికులు చూసి కిందికి దించారు. అప్పటికే కొండారెడ్డి చనిపోయాడు. ఎస్ఐ ఏమంటున్నారంటే... ఈ సంఘటనపై వన్‌టౌన్ ఎస్ఐ ఆంజనేయులును ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆర్టీసీ యూనియన్ నాయకులు ఫిర్యాదు విషయంపై తనతో మాట్లాడలేదన్నారు. కొండారెడ్డిపై పెట్టిన కేసును లోక్ అదాలత్‌లో పెట్టించి.. రాజీ చేసే విషయంపై మాట్లాడారని ఆయన చెప్పారు. ఫిర్యాదు తీసుకుని ఉంటే చనిపోయేవాడు కాదు విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చిన అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి, రూరల్ సీఐ ఓబులేసు, టూటౌన్ ఎస్ఐ మంజునాథరెడ్డితో యూనియన్ నాయకులు మాచయ్య, శేఖర్ మాట్లాడారు. కొండారెడ్డి ఫిర్యాదును తీసుకుని ఉంటే అతను చనిపోయి ఉండే వాడు కాదని వారు అన్నారు. కుటుంబ సభ్యులు కొండారెడ్డి మృతదేహం వద్దకు వచ్చి రోదించడం తోటి కార్మికులను కలిచివేసింది. ‘దిక్కులేనోళ్లను చేసి.. వెళ్లావా’ అంటూ భార్య సులోచన గుండెలవిసేలా రోదించింది. ‘నా భర్తను కొట్టి.. కేసు పెట్టినందుకే అవమానంతో చనిపోయాడు. ఆయన చావుకు మీరే కారణం’ అని ఆమె ఆరోపించింది. జరిగిన సంఘటనపై డిపో మేనేజర్ హరి దృష్టికి కార్మికులు తీసుకెళ్లినా.. ఇద్దరిని సస్పెండ్ చేస్తామని అన్నారే తప్ప వారిని విచారణ చేసి, మందలించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని యూనియన్ నాయకులు అంటున్నారు. కొండారెడ్డి కుమారుడు వెంకట కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
ఉద్యమజోరు
రాష్ట్ర విభజన ప్రకటన మరో ఇద్దరి ఉసురు తీసింది. సమైక్యనాదాన్ని గట్టిగా వినిపిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ రాములు ఉద్యమ వార్తలు చదువుతూ ఇంట్లోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. వ్యవసాయ కూలీ ఉక్కాల రవి సమైక్యభేరి సభ నుంచి తిరిగి వెళుతూ గుండె పోటుకు గురై, ఇంట్లో అడుగుపెట్టగానే మృతి చెందాడు. ఇద్దరు సమైక్యవాదులు హఠాన్మరణం చెందడంతో జిల్లా వాసులు విషాదంలో మునిగిపోయారు. సాక్షి, నెల్లూరు : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో సింహపురివాసులు చేపట్టిన ఉద్యమం శనివారం 60వ రోజు మరింత ఉధృతంగా సాగింది. నగరంలో నీటిపారుదలశాఖ ఉద్యోగులు చెవిలో పూలు పెట్టుకుని వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుడు ఎన్.రాములు సమైక్యాంధ్ర కోసం అసువులు బాసారు. టీపీగూడూరు, ఆత్మకూరులలో మహిళా గర్జనలు పెద్ద ఎత్తున జరిగాయి. వీఆర్సీ సెంటర్లో ముస్లింలు దీక్షలు కొనసాగించారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల జరుగుతున్న సమైక్యాంధ్ర దీక్షలకు శనివారం వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు.నగరంలో ఎన్జీఓ హోంలో ఆర్అండ్బీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీఎస్‌యూ ఆధ్వర్యంలో క్యాంపస్ కళాశాల నుంచి గాంధీ బొమ్మ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గోల్డెన్ జూబ్లీహాల్లో మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సమీక్ష సమావేశాన్ని ఏపీ ఎన్జీఓ నాయకులు అడ్డుకున్నారు. వేదాయపాళెం సెంటర్లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి నాల్గో రోజుకు చేరుకున్నాయి. వీరికి నెల్లూరు నగర వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ సంఘీభావం ప్రకటించారు. వెంకటగిరిలో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో బ్యాంకులు మూయించారు. పొదలకూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. గూడూరులో జేఏసీ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. అలాగే చెన్నూరుకు చెందిన ఉపాధ్యాయులు సకల జనుల సమ్మెలో భాగంగా గూడూరు వరకు పాదయాత్ర చేపట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు టవర్‌క్లాక్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. చిట్టమూరు మండలం కొత్తగుంటలో జేఏసీ కన్వీనర్ జ్ఞానానందం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన చిట్టమూరు సమైక్యగర్జన హోరెత్తింది. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో జేఏసీ నాయకులు చేపట్టిన దీక్షలో పట్టణంలోని మేకపాటి వెంకురెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. జేఏసీ నాయకులు ర్యాలీగా వెళ్లి సిండికేట్ బ్యాంకు, ఏపీజీబీ, టెలికం కార్యాలయం, స్టేట్బ్యాంకులను మూసి వేయించారు. కోవూరు ఎన్జీఓహోంలో కోవూరు గ్రామస్తులు దీక్ష చేపట్టారు. బుచ్చిరెడ్డిపాళెంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను జేఏసీ నాయకులు మూసి వేయించారు. విడవలూరులో పొదుపు మహిళలు రిలే నిరాహారదీక్ష చేశారు. కావలి ఆర్డీవో కార్యాలయ సెంటర్లో ప్రభుత్వ జేఏసీ శిబిరంలో రిలే నిరాహారదీక్షలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన కార్యక్రమం జరిగింది. పట్టణంలో సమైక్యాంధ్ర జేఏసీ, వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగాయి. ఆత్మకూరులో మహిళా ఉద్యోగులు, విద్యార్థినుల ఆధ్వర్యంలో మహిళా గర్జన మహా సభ బస్టాండ్ సెంటర్లో నిర్వహించారు. స్థానిక బాలికోన్నత పాఠశాల నుంచి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరుపాళెం ఉన్నత పాఠశాలలో తరగతుల నిర్వహణను ఎన్జీఓలు అడ్డుకున్నారు.