రాష్ట్ర విభజన ప్రకటన మరో ఇద్దరి ఉసురు తీసింది. సమైక్యనాదాన్ని గట్టిగా వినిపిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ రాములు ఉద్యమ వార్తలు చదువుతూ ఇంట్లోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. వ్యవసాయ కూలీ ఉక్కాల రవి సమైక్యభేరి సభ నుంచి తిరిగి వెళుతూ గుండె పోటుకు గురై, ఇంట్లో అడుగుపెట్టగానే మృతి చెందాడు. ఇద్దరు సమైక్యవాదులు హఠాన్మరణం చెందడంతో జిల్లా వాసులు విషాదంలో మునిగిపోయారు.
సాక్షి, నెల్లూరు : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో సింహపురివాసులు చేపట్టిన ఉద్యమం శనివారం 60వ రోజు మరింత ఉధృతంగా సాగింది. నగరంలో నీటిపారుదలశాఖ ఉద్యోగులు చెవిలో పూలు పెట్టుకుని వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుడు ఎన్.రాములు సమైక్యాంధ్ర కోసం అసువులు బాసారు. టీపీగూడూరు, ఆత్మకూరులలో మహిళా గర్జనలు పెద్ద ఎత్తున జరిగాయి. వీఆర్‌సీ సెంటర్‌లో ముస్లింలు దీక్షలు కొనసాగించారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల జరుగుతున్న సమైక్యాంధ్ర దీక్షలకు శనివారం వైఎస్సార్‌సీపీ నేతలు సంఘీభావం తెలిపారు.నగరంలో ఎన్‌జీఓ హోంలో ఆర్‌అండ్‌బీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
వీఎస్‌యూ ఆధ్వర్యంలో క్యాంపస్ కళాశాల నుంచి గాంధీ బొమ్మ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గోల్డెన్ జూబ్లీహాల్లో మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సమీక్ష సమావేశాన్ని ఏపీ ఎన్‌జీఓ నాయకులు అడ్డుకున్నారు. వేదాయపాళెం సెంటర్‌లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి నాల్గో రోజుకు చేరుకున్నాయి. వీరికి నెల్లూరు నగర వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ సంఘీభావం ప్రకటించారు.
వెంకటగిరిలో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో బ్యాంకులు మూయించారు. పొదలకూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. గూడూరులో జేఏసీ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. అలాగే చెన్నూరుకు చెందిన ఉపాధ్యాయులు సకల జనుల సమ్మెలో భాగంగా గూడూరు వరకు పాదయాత్ర చేపట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు టవర్‌క్లాక్ సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. చిట్టమూరు మండలం కొత్తగుంటలో జేఏసీ కన్వీనర్ జ్ఞానానందం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన చిట్టమూరు సమైక్యగర్జన హోరెత్తింది.
ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌లో జేఏసీ నాయకులు చేపట్టిన దీక్షలో పట్టణంలోని మేకపాటి వెంకురెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. జేఏసీ నాయకులు ర్యాలీగా వెళ్లి సిండికేట్ బ్యాంకు, ఏపీజీబీ, టెలికం కార్యాలయం, స్టేట్‌బ్యాంకులను మూసి వేయించారు.
కోవూరు ఎన్జీఓహోంలో కోవూరు గ్రామస్తులు దీక్ష చేపట్టారు. బుచ్చిరెడ్డిపాళెంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను జేఏసీ నాయకులు మూసి వేయించారు. విడవలూరులో పొదుపు మహిళలు రిలే నిరాహారదీక్ష చేశారు.
కావలి ఆర్డీవో కార్యాలయ సెంటర్లో ప్రభుత్వ జేఏసీ శిబిరంలో రిలే నిరాహారదీక్షలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన కార్యక్రమం జరిగింది. పట్టణంలో సమైక్యాంధ్ర జేఏసీ, వైఎస్సార్‌సీపీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగాయి.
ఆత్మకూరులో మహిళా ఉద్యోగులు, విద్యార్థినుల ఆధ్వర్యంలో మహిళా గర్జన మహా సభ బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించారు. స్థానిక బాలికోన్నత పాఠశాల నుంచి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరుపాళెం ఉన్నత పాఠశాలలో తరగతుల నిర్వహణను ఎన్‌జీఓలు అడ్డుకున్నారు.
ఉద్యమజోరు
Published Sun, Sep 29 2013 3:42 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement