
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు’ను గవర్నర్ తమిళిసై పరిశీలన కోసం ఆపడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
శనివారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్విసులను నిలిపివేయాలని ఉద్యోగులు, కార్మికులకు పిలుపునిచ్చాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశాయి.