
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ దాటుకుని పరుగులు పెడుతోంది. బుధవారం అన్ని బస్ డిపోల ముందు నిరాహార దీక్షలు చేపట్టాలన్న ఆర్టీసీ జేఏసీ నేతల పిలుపు మేరకు కార్మికులు, వామపక్ష నాయకులు కదం తొక్కారు. ముషీరాబాద్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు పాల్పడకుండా.. చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు.
(చదవండి : ప్రైవేట్ బస్సులు నడిస్తే కార్మికుల శవాలపైనే..)
ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ పెట్టాడు. బెదిరించాడు. అయినా 50 వేల మంది కార్మికుల్లో కేవలం 360 మంది మాత్రమే విధుల్లో చేరారు. చేరిన వాళ్ళలో కూడా డ్రైవర్లు, కండక్టర్లు లేనేలేరు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్నివర్గాల ప్రజలు అండగా ఉన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. చూస్తూ ఊరుకోలేక రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడ్డాయి. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే... కార్మికుల శవాలపైన మాత్రమే ప్రైవేట్ బస్సులు వెళ్ళాలి.
ప్రైవేట్ బస్సులను నడిపితే ఎక్కడికక్కడ కార్మికులు అడ్డుకుంటారు. అవసరమైతే తగులబెడతారు. పక్క రాష్ట్రంలో ప్రభుత్వపరం చేసి చూపించారు. ఇక్కడెందుకు సాధ్యం కాదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలి’అని అన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మెను ఉధృతం చేయడంతో బస్ డిపోల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులకు పాట్లు తప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment