
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం మఖ్దూంభవన్‌లో ఆయన మీడితో మాట్లాడుతూ, ఉమ్మడి ఏపీలో విజయవాడలో ప్రైవేట్ బస్సులకు అనుమతిపై కోర్టు స్టే ఇచ్చిన అరగంటకే అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎంకే ప్రజాస్వామ్యంపై గౌరవం లేకపోతే ఆయనపై ప్రజలకు గౌరవం ఉండదన్నారు. తక్షణమే ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, పార్టీ నాయకులు కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.