సాక్షి, వరంగల్ : ఆర్టీసీలో కేంద్రం వాటా 31శాతం ఉందని, కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ఊరుకుంటుందా అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు మంగళవారం సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. బలిదానాలు లేని తెలంగాణ కోరుకుంటే కేసీఆర్ ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల చెంపపై కొడితే.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిషా.. కేసీఆర్ చెంపపై కొడతారని ఎద్దేవా చేశారు. మోడీ, అమిత్ షా.. కేసీఆర్ మెడలు వంచుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులను తొలగించి ప్రేవేటుపరం చేసి బస్సులు నడిపితే తమ శవాలపై చక్రాలు వెళ్లాలన్నారు. ప్రభుత్వం ఎన్ని డెడ్‌లైన్లు పెట్టినా కార్మికులు పట్టుదలతో ఉండాలని సూచించారు.
అలాగే టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవులు పొందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి ఆర్టీసీ కార్మికులపై అవాకులు, చవాకులు పలుకుతున్నారని మండిపడ్డారు. అసలైన తెలంగాణ వాదులైన ఈటెల రాజేందర్, కేటీఆర్, హరీశ్‌రావు కార్మికులపై ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని నిలదీశారు. మంత్రి పదవి పోగానే ఎర్ర బస్సు ఎక్కక తప్పదని ప్రతి ఒక్కరూ గర్తుంచుకోవాలని సూచించారు. ఈ కుటుంబంలోనే పుట్టిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన తండ్రి వారసత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చరిత్రలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నిలిచిపోతుందని, కార్మిక వర్గం విజయం సాధించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం కానే కాదని, దేశ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు అన్ని సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment