‘నయా నిజాం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్‌ చేస్తున్నారు’ | New Nizam KCR Wants To Privatize RTC | Sakshi
Sakshi News home page

‘నయా నిజాం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్‌ చేస్తున్నారు’

Published Fri, Nov 8 2019 2:52 PM | Last Updated on Fri, Nov 8 2019 3:00 PM

New Nizam KCR Wants To Privatize RTC - Sakshi

సాక్షి, హైదరాబాద్: నిజాం కాలంలో ఆవిర్భవించిన ఆర్టీసీని నయా నిజాం కేసీఆర్ ప్రైవేట్‌ పరం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. ఆర్టీసీని కాపాడేందుకు ఎంఐఎం ఇప్పటికైనా
 ప్రభుత్వం నుంచి బయటకు రావాలని సీపీఐ నారాయణ సూచించారు. శుక్రవారం మగ్దూం భవన్‌లో అత్యవసరంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నప్పటికీ.. ప్రభుత్వానికి ఎంఐఎం ఇప్పటికి కూడా మద్దతివ్వడంపై విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే చలో ట్యాంక్ బండ్‌లో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. హైకోర్టు ప్రైవేట్‌ బస్సులకు రూట్ పర్మిట్‌పై స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

రాష్ట్రంలో ప్రయివేట్ బస్సులు ప్రవేశ పెట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి ప్రయత్నిస్తే.. కోర్టు స్టే ఇవ్వడంతో ఆయన ఏకంగా సీఎం పదవికే రాజీనామా చేశారని గతాన్ని గుర్తు చేశారు. కోర్టులో సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్లకు అవమానం ఎదురైతే.. ప్రభుత్వానికి కూడా అది అవమానమే అని కేసీఆర్‌ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, అధికారులకు అవమానం జరిగితే.. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలకు అవమానమని భావించి తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తీరు మార్చుకోకపోతే రావణాసురుడికి పట్టిన గతే పడుతుందని విమర్శించారు.

హైకోర్టు 11న ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచేందుకు అవకాశం ఇచ్చిందని.. ఇప్పటికైనా వారిని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించేలా చూడాలన్నారు. రాష్ట్ర రెండో రాజధానిపై విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలకు.. సొంత పార్టీ వారు సంబంధం లేదంటే.. ఆయన మాత్రం తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడం ఏమి బాలేదన్నారు. కేవలం ఆర్టీసీ సమస్యను పక్కదారి పట్టించేందుకే విద్యాసాగర్ రావు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నరని ధ్వజమెత్తారు. ఛలో ట్యాంక్‌బండ్ పిలుపు నేపథ్యంలో.. ముందస్తు అరెస్టులపై ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తదితరులు హాజరయ్యారు. 

కేసీఆర్‌ చెప్పినట్లు చేయడం వల్లే.. కోర్టు బోనులో తలదించుకుంటున్నారు
చట్టాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్లు చేయడం వల్లే.. నేడు ఐఏఎస్‌ అధికారులకు కోర్టు బోనులో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇక్కడ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐదున్నరేళ్ల కేసీఆర్‌ ప్రభుత్వం పాలనలో కోర్టు ఎన్నో మొట్టికాయలు వేసిందని అన్నారు. ప్రైవేట్‌ బస్సులకు రూట్ పర్మిట్‌పై కోర్టు స్టే ఇచ్చిందని, దీనిపై కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని ఎద్దేవా చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు తక్షణమే ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అలానే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. ఏమాత్రం ప్రశాంతత లేదని.. ఉద్యమాలు అణచడానికి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఛలో ట్యాంక్ బండ్‌ను విజయవంతం చేయాలని అందరిని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement