సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో మరో ప్రాణం బలైపోయింది. మహబూబాబాద్ డిపో డ్రైవర్ నరేష్ బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే నరేష్ ప్రాణాలు విడిచాడు. నరేష్‌కు భార్య పోలమ్మ, ఇద్దరు పిల్లలు శ్రీకాంత్, సాయికిరణ్ ఉన్నారు.
అతను 2007 నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత ఐదేళ్లుగా నరేష్ భార్య హృద్రోగంతో బాధపడుతోందని, నెలకు రూ. 5వేల మందులు వాడుతున్నారని, మరోవైపు ఇద్దరు పిల్లలు చదువుతుండటంతో నరేష్ ఆర్థికంగా అనేక బాధలు పడుతున్నాడని, ఈ క్రమంలో మొదలైన సమ్మె ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని తోటి కార్మికులు చెప్తున్నారు. నరేష్ ఆత్మహత్య వార్త తెలియడంతో అఖిలపక్ష నాయకులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇది ప్రభుత్వ హత్యేనని, కోర్టు విచారణ పేరిట కాలయాపన చేయకుండా కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి.. సమస్యను పరిష్కరించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
నా చావుకు ముఖ్యమంత్రే కారణం!
ఆత్మహత్య చేసుకునే ముందు ఆర్టీసీ డ్రైవర్ నరేష్ సూసైడ్ లెటర్ రాసినట్టు తెలుస్తోంది. ‘నా చావుకు ముఖ్యమంత్రే కారణం. నా వల్ల ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలి. ఆర్టీసీలో నాదే చివరి బలిదానం కావాలని ముఖ్యమంత్రిగారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నా కుటుంబానికి వచ్చిన ఇబ్బంది మరో కుటుంబానికి రాకూడదు. ఇది నేను సొంతంగా రాసిన లేఖ. నా అంత్యక్రియలకు అశ్వత్థామరెడ్డి హాజరుకావాలి. ఆర్టీసీ కార్మికులు బాగుండాలి’ అంటూ ఈ లేఖలో నరేష్ పేర్కొన్నాడు. ఈ లేఖను చూసి ఆర్టీసీ కార్మికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment