ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలకు టైమ్‌ ఫిక్స్‌ | Telangana Government Ready To Discuss TSRTC JAC In Hyderabad | Sakshi
Sakshi News home page

నేడే చర్చలు: సీఎం పచ్చజెండా  

Published Sat, Oct 26 2019 2:15 AM | Last Updated on Sat, Oct 26 2019 9:36 AM

Telangana Government Ready To Discuss TSRTC JAC In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎట్టకేలకు చర్చలకు ప్రభుత్వం సిద్ధమైంది. శనివారం మధ్యాహ‍్నం రెండు గంటలకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ కార్యాలయంలో ఈ చర్చలు జరుగుతాయని సమాచారం. అయితే కార్మిక సంఘాల నేతలతో చర్చల్లో ఆర్టీసీ ఈడీలు పాల్గొంటారని తెలిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు దాదాపు 5 గంటల పాటు జరిగిన సమీక్షలో ఎట్టకేలకు చర్చల ప్రక్రియకు సీఎం కేసీఆర్‌ సమ్మతం తెలిపినట్లు సమాచారం. ఈ నెల 28న హైకోర్టులో సమ్మెపై విచారణ ఉన్న నేపథ్యంలో చర్చలు జరిపి వివరాలు కోర్టుకు సమర్పించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. గడువు ఎక్కువగా లేనందున శనివారమే చర్చలకు ముహూర్తం ఖాయం చేశారు. సమ్మె ప్రారంభం కాకముందు ఐఏఎస్‌ అధికారుల త్రిసభ్య కమిటీ చర్చలు జరిపిన ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో ఈ చర్చలు ఉంటాయని తెలుస్తోంది. బస్‌భవన్‌లోనే చర్చలు జరపాలని తొలుత భావించినా, అక్కడికి పెద్ద సంఖ్యలో కార్మికులు వచ్చే అవకాశం ఉండటంతో ఎర్రమంజిల్‌లో జరపాలని భావిస్తున్నట్లు తెలిసింది. చర్చల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించకపోవటం విశేషం. శుక్రవారం రాత్రి పొద్దుపోయేవరకు అటు కార్మిక సంఘాల జేఏసీకి కూడా ఎలాంటి సమాచారం అందలేదని తెలిసింది. 

నివేదికపై సుదీర్ఘ చర్చ.. 
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌ కాకుండా హైకోర్టు సూచించిన 21 డిమాండ్లపై పరిశీలించి నివేదిక సిద్ధం చేయాల్సిందిగా సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. సమ్మె పరిష్కారానికి చర్యలు చేపట్టాలంటూ హైకోర్టు సునీల్‌శర్మను ఆదేశించిన నేపథ్యంలో, కమిటీ ఏర్పాటు బాధ్యతను సునీల్‌శర్మకే సీఎం అప్పగించారు. మూడు రోజుల కింద జరిగిన సమీక్షలో సీఎం సమక్షంలోనే ఎండీ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ గురువారమే నివేదికను సిద్ధం చేయగా, అదేరోజు సాయంత్రం ఎండీకి సమర్పించారు. దీనిపై చర్చించిన ఎండీ చేసిన సూచనల మేరకు పలు మార్పులు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మరోసారి కమిటీ సభ్యులు భేటీ అయి తుది నివేదిక సిద్ధం చేసి సాయంత్రం ఎండీకి అందజేశారు. ప్రగతిభవన్‌లో నివేదికపై దాదాపు 5 గంటలపాటు సీఎం సమీక్షించారు. కార్మికులతో చర్చలు జరపాలా వద్దా.. జరిపితే ఏయే అంశాలు ఎజెండాలో ఉండాలి.. సమ్మె పర్యవసానాలు, సమ్మెకు దారితీసిన పరిస్థితులు, తరచూ సమ్మెల వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, ఆర్టీసీ కుప్పకూలే దుస్థితికి చేరుకోవటానికి దారితీసిన పరిస్థితులు.. ఇలా సమగ్ర సమాచారాన్ని కోర్టుకు సమర్పించటం తదితర అంశాలపై చర్చించారు.

సమ్మెపై పలుసార్లు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీకి చేసిన సూచనలు, ఐఏఎస్‌ అధికారుల కమిటీ తీరుపై చేసిన ఘాటు వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చాయి. అయితే ఆర్థిక అంశాలతో ముడిపడని డిమాండ్లపైనే ఈ చర్చలు ఉంటాయని తెలుస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే ప్రధాన డిమాండుగా జేఏసీ పేర్కొంటున్నా, అసలు దాన్ని పరిగణనలోకే తీసుకోబోమని సీఎం ఇప్పటికే తేల్చిచెప్పారు. దీంతో ఇప్పుడు చర్చల్లో ఆ అంశం ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. కోర్టు సూచించినట్లు మిగతా అంశాల ప్రస్తావనే ఉండనుంది. కాగా, సమావేశానంతరం సీఎంవో నుంచి కానీ, ఆర్టీసీ నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అధికారులు కూడా మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. 

ప్రభుత్వానికి నివేదిక 
మూడు రోజుల పాటు కసరత్తు చేసిన అనంతరం ఆర్టీసీ ఉన్నతాధికారుల కమిటీ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీకి పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు ఆర్టీసీ ఎండీ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు కసరత్తు చేసి ఆర్టీసీ ఈడీలు టి.వెంకటేశ్వరరావు, ఎం.వెంకటేశ్వరరావు, వినోద్‌కుమార్, పురుషోత్తంనాయక్, యాదగిరి, ఆర్టీసీ ఆర్థిక సలహాదారు రమేశ్‌లతో కూడిన ఈ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. దాన్ని సీఎం కేసీఆర్‌కు అందజేశారు.

అంతా రికార్డు చేయాలి: అశ్వత్థామరెడ్డి 
చర్చలకు ఆహ్వానిస్తే సంతోషమేనని, అయితే ఆర్టీసీ విలీనం అంశం కూడా చర్చల్లో ఉండాలని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి శుక్రవారం రాత్రి ‘సాక్షి’తో తేల్చిచెప్పారు. చర్చల ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేయాలని తాము కోరబోతున్నట్లు వెల్లడించారు. వీడియో రికార్డు జరపలేకపోతే చర్చల సారాంశాన్ని నమోదు చేసి తమ సంతకాలు, చర్చల్లో పాల్గొన్న అధికారుల సంతకాలు తీసుకోవాలని కోరనున్నట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement