
నల్లగొండలో తలకిందులుగా నిలబడి నిరసన తెలుపుతున్న ఓ ఆర్టీసీ కార్మికుడు
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీని కాపాడుకుందాం... ప్రజా రవాణా వ్యవస్థను పరిరక్షించుకుందాం..’ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే నినాదం కనిపించింది. వేలమంది ఆర్టీసీ కార్మికులు ఈ నినాదం రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని కూడళ్ల వద్ద నిలబడి సాధారణ ప్రజానీకంతో మాట్లాడి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. శనివారం నాటి బంద్‌కు ప్రజలు కూడా మద్దతు తెలపటంతో వారికి కృతజ్ఞతలు తెలుపుతూనే తదుపరి తమ కార్యాచరణకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. కొన్ని ప్రాంతాల్లో వారి కుటుంబసభ్యులు కూడా నిలబడి ప్రజలకు గులాబీ పూలు ఇచ్చి మరీ మద్దతు కోరటం విశేషం. ఇక యథాప్రకారం డిపోల ముందు నిలబడి బస్సులు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాత్కాలిక డ్రైవర్లు తమ పొట్టకొట్టొద్దని వేడుకునే ప్రయత్నం చేశారు. శాంతియుతంగా కార్యక్రమాలు జరగటంతో రాష్ట్రంలో ఎక్కడా పెద్ద ఉద్రిక్తత నెలకొనలేదు. గత పక్షం రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న సత్తుపల్లికి చెందిన డ్రైవర్ ఖాజామియా ఆదివారం గుండెపోటుతో మృతి చెందటం కార్మికులను కలచివేసింది. ఉద్యోగ భద్రత దిగులుతోనే ఆయన మృతి చెందాడంటూ కార్మికులు ఆరో పించారు. ములుగు జిల్లాలో జాతీయ రహదారిపై ఆదివారం సాయత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన తాత్కాలిక డ్రైవర్ పరారయ్యాడు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 4,502 ఆర్టీసీ బస్సులు, 1,953 అద్దె బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. మొత్తంగా 71.93% సర్వీసులు రోడ్డెక్కినట్టు వెల్లడించింది.
నేడు కీలక నిర్ణయం వెలువడనుందా?
ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలంటూ 18న హైకోర్టు ఇచ్చిన ఆదేశం తాలూకు ప్రతి సోమ వారం అధికారులకు అందే అవకాశముంది. దీంతో సోమవారం కీలక నిర్ణయం వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రతి అందితే దాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి తదుపరి కార్యాచరణను అధికారులు రూపొందించనున్నారు.
విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు
దసరా సెలవుల పొడిగింపు పూర్తి కావటంతో సోమవారం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇప్పటివరకు ఆయా విద్యా సంస్థ ల బస్సులను కూడా ప్రభుత్వం స్టేజీ క్యారియర్లుగా వాడుకుంది. ఇప్పుడు ఆ బస్సులన్నీ తిరిగి విద్యా సంస్థలకు వెళ్లిపోయాయి. విద్యార్థులకు ఇబ్బంది కాకుండా బస్సులు ఏర్పాట్లు చేయాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు ఆదివారం ముందస్తు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇక విద్యార్థుల బస్ పాస్‌లు కేటగిరీతో సంబం ధం లేకుండా అన్ని బస్సుల్లో చెల్లుబాటయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ సమ్మె 16వ రోజు ఉధృతంగానే కొనసాగింది. అన్ని జిల్లాల్లో ఉదయం నుంచే డిపోల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా విపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు ధర్నాల్లో పాల్గొన్నారు.
నేడు వీడియో కాన్ఫరెన్సు
విద్యాసంస్థలు తెరుచుకోనుండటంతో పరిస్థితిని అంచనా వేసి ఆదేశాలు జారీ చేసేందుకు వీలుగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ఉదయం 11 గంటలకు ఆర్టీసీ, రవాణా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment