రెండో రోజూ ‘బస్సు’ బంద్ ఉద్రిక్తత | 2nd day Bus strike tension | Sakshi
Sakshi News home page

రెండో రోజూ ‘బస్సు’ బంద్ ఉద్రిక్తత

Published Fri, May 8 2015 1:05 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

2nd day Bus strike tension

- తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో రోడ్డెక్కిన బస్సులు
- కార్మికుల కన్నెర్ర.. అడ్డుకున్న సిబ్బంది..
- టైర్లలో గాలి తీసివేత.. బస్సు అద్దాలు ధ్వంసం
- కానిస్టేబుల్‌కు గాయూలు.. చెదరగొట్టిన పోలీసులు..
- ఆర్టీసీ జేఏసీ భారీ ర్యాలీ.. పోలీసుల అదుపులో కొందరు కార్మికులు
హన్మకొండ :
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా రెండోరోజు గురువారం చేపట్టిన బస్సుల బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. పూర్తిస్థారుులో బస్సు సర్వీసులు నిలిచిపోరునప్పటికీ...  తాత్కాలిక ఉద్యోగులను తీసుకోవడం, అద్దె బస్సులు నడిపించడంపై కార్మికులు కన్నెర్ర చేశారు. సమ్మెలో భాగంగా హన్మకొండ డిపో నుంచి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం కూడలి, పెట్రోల్ పంప్, హన్మకొండ చౌరస్తా మీదుగా వరంగల్-2 డిపో ముందు నుంచి హన్మకొండ జిల్లా స్టేషన్‌కు ర్యాలీ చేరుకుంది. జిల్లా బస్‌స్టేషన్‌లోకి ర్యాలీగా వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో కార్మికులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే క్రమంలో వరంగల్-2 డిపోకు చెందిన బస్సు ఇటు వైపు రావడంతోవారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మహిళా కార్మికులు బస్సులకు అడ్డంగా బైఠాయించగా... కొందరు ఆర్టీసీ సిబ్బంది నడుస్తున్న బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో వరంగల్-2 డిపోకు చెందిన ఓ అద్దె బస్సు అద్దాలు పగిలాయి. బందోబస్తులో ఉన్న ఓ కానిస్టేబుల్‌కు రాయి తగలడంతో స్వల్పంగా గాయమైంది. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు చెదరగొట్టారు. రాళ్లు విసిరాడంటూ ఆర్టీసీ కార్మికుడు అలీని పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించేందుకు వాహనంలోకి ఎక్కించడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసు వాహనాన్ని కార్మికులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు.

ఇదే క్రమంలో జగిత్యాల డిపోకు చెందిన రెండు అద్దె బస్సులు రావడంతో కార్మికులు ఆ బస్సులనూ అడ్డగించారు. మహిళా కార్మికులు బస్సుల ముందు బైఠాయించారు. కొంత మంది బస్సుల టైర్లలో గాలి తీశారు. పోలీసులు అదుపులోకి తీసుకొన్న కార్మికుడిని వదిలేయడంతో కార్మికులు శాంతించారు. అనంతరం బస్‌స్టేషన్ ద్వారం వద్ద కార్మికులు టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. ర్యాలీలో ఆర్టీసీ జేఏసీ నాయకులు ఈఎస్ బాబు, జితేందర్‌రెడ్డి, సిహెచ్ యాకస్వామి, ఈదురు వెంకన్న, మనోహర్, సీహెచ్.రాంచందర్, యాదయ్య, యాదగిరి, ఎండీ.గౌస్. కేడీ.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెండో రోజు రూ.కోటి నష్టం
జిల్లాలోని తొమ్మిది డిపోల్లో 965 బస్సులు ఉన్నారు. ఇందులో 758 సంస్థ బస్సులు, 207 అద్దె బస్సులు. ఇందులో సంస్థకు చెందిన 12 ఆర్టీసీ బస్సులను తాత్కాలి డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో బయటకు వెళ్లాయి. 142 అద్దె బస్సులు తిరిగినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ రీజియన్‌లో మొత్తం 4539 మంది కార్మికులు, ఉద్యోగులు, సూపర్‌వైజర్లు, మెకానిక్‌లు సమ్మెలో పాల్గొన్నారు.

ఇందులో కండక్టర్లు, డ్రైవర్లు 3605 మంది ఉండగా... మిగతా వారు సూపర్ వైజర్లు, మెకానిక్‌లు, డీసీలు, ఏడీసీలు, ఇతర ఉద్యోగులున్నారు. సమ్మెతో రెండో రోజు దాదాపు రూ.98 లక్షల నుంచి రూ.కోటి వరకు సంస్థ ఆదాయాన్ని కోల్పోయింది. తాత్కాలికంగా హన్మకొండ నుంచి పరకాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, జనగామ, హైదరాబాద్, కరీంనగర్ రూట్లలో నడిపినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం యాదగిరి తెలిపారు.

ఫలించని అధికారుల వ్యూహం
ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైనప్పటికీ... గురువారం పూర్తిస్థాయిలో బస్సులు నడుపలేకపోయూరు. బుధవారం తాత్కాలిక డ్రైవర్లుగా 30 మందిని ఎంపిక చేసి డిపోలకు కేటాయించినప్పటికీ...  గురువారం 12 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. దీంతో  మరో 12 మంది తాత్కాలిక కండక్టర్లను విధుల్లోకి తీసుకుని 12 బస్సులు నడిపారు. గురువారం మరో 40 మంది తాత్కాలిక డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించారు.

ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సు యజమానులకే పూర్తి స్వేచ్ఛను వదిలేసింది. దీంతో కొంత మంది అద్దె బస్సు యజమానులు బస్సులను తిప్పారు. బస్‌స్టేషన్ ప్రాంతాలకు బస్సులు వెళ్లే ఇబ్బందులు తప్పవని భావించిన అద్దె బస్సు యజమానులు బస్‌స్టేషన్లకు కొంచెం దూరంలో ప్రధాన కూడళ్లలో ప్రయాణికులను దింపి, ఎక్కించుకొని వెళుతున్నారు. అరుుతే కార్మికులు అడ్డుకుంటారని, నష్టం చేస్తారనే భయంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు.

సంఘీభావాల వెల్లువ
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాస్‌రావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పనాసా ప్రసాద్,నాయకుడు సిరబోయిన కర్ణాకర్ సంఘీభావం తెలిపారు.   ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని మార్తినేని ధర్మారావు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు.  కార్మికుల పోరాటానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తక్కళ్ళపల్లి శ్రీనివాస్‌రావు అన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా సమస్యను పరిష్కరించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement