రెండు బస్సులు ఢీ, ఒకరు మృతి
రెండు బస్సులు ఢీ, ఒకరు మృతి
Published Mon, Aug 8 2016 11:40 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
మిర్యాలగూడ అర్బన్
ఆగి ఉన్న బస్సును మరో బస్సు ఢీకొడ్డటంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణం నార్కట్‌పల్లి–అద్దంకి బైపాస్‌పై ఏడుకోట్ల తండా సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న కనిగిరి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు పట్టణంలోని అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్ రోడ్డుపై ఉన్న ఉషారాణి హోటల్ వద్ద ప్రయాణికులు టీ తాగడానికి నిలిపారు. ఈ క్రమంలో ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న శ్రీ కృష్ణా ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న బస్సును అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందు భాగంలోని మెట్లపై కూర్చొని నిద్రపోతున్న ప్రైవేట్ బస్సు క్లీనర్ గర్నికోడి బ్రహ్మయ్య(21) అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సుకు ఉన్న ఐరన్‌బాడీ నుజ్జునుజ్జు కావడంతో క్లీనర్ మృతదేహం అందులో ఇరుక్కు పోయింది. విషయం తెలుసుకున్న టూటౌన్ సీఐ పాండురంగారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రేకుల మధ్య ఇరుక్కున్న క్లీనర్ మృతదేహాన్ని బయటికి తీశారు. అనంతరం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు ఆగి ఉన్న బస్సులో ఉన్న జే.శ్రీనివాస్(నెల్లూరు), ఆదిలక్ష్మి(ఒంగోలు), ఆంజనేయులు, ఎస్‌డి.ఖాజా(హైదరాబాద్), ఎం.శ్రీనివాసులు(ఒంగోలు), పాల సుధాకర్(శివరాయినిపేట), కల్వకూరి హరిబాబు(కొండబుచ్చిపాలెం)లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.
నిద్రమత్తే కారణం..?
కాగా శ్రీకృష్ణా ట్రావెల్స్ బస్సుడ్రైవర్ అతివేగంతో పాటు నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులో కేవలం ఒకే డ్రైవర్ ఉండటం రాత్రి మెుత్తం డ్రైవింగ్ చేస్తుండటంతో నిద్రకు తాళలేక రెప్పపాటులో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా బస్సును అజాగ్రత్తగా అతివేగంగా నడపడం వలన ప్రమాదం చోటు చేసుకుందని అక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. కాగా ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడని తెలిసింది.
Advertisement
Advertisement