సాక్షి, మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఓ యువకుడు పోలీసులకు షాకిచ్చాడు. రోడ్డుపై వాహనా లు నిలిపి మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులను ప్రశ్నిస్తుండగా.. అందులో ఒకరు తప్పించుకుని ఏకంగా పోలీసుల వాహనాన్నే ఎత్తుకెళ్లాడు. గురువారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మిర్యాలగూడ మండలం కొత్త గూడం గ్రామానికి చెందిన దైద మహేశ్, బాదలాపురం గ్రామానికి చెందిన బంటు సాయికిరణ్, నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన సోమువంశీ స్నేహితులు.
వీరు గురువారం అర్ధరాత్రి మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తాలో రోడ్డుపై తమ వాహనాలను నిలిపి మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న రూరల్ సీఐ రమేశ్‌బాబు తన సిబ్బందితో కలిసి వెళ్తుండగా వారిని గమనించి ఆగారు. పోలీసులను గమనించిన ముగ్గురు స్నేహితులు పారిపోతుండగా పట్టుకుని వారి వద్ద నుంచి వివరాలు సేకరించే క్రమంలో సోమువంశీ పోలీసుల వాహనాన్ని స్టార్ట్ చేసుకుని కోదాడ రోడ్డు వైపునకు పారిపోయాడు.
దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన పోలీసులు..అదే రోడ్డులో విధులు నిర్వహిస్తున్న రూరల్ ఎస్‌ఐ పరమేశ్‌ను అప్రమత్తం చేశారు. దీంతో ఎస్‌ఐ తన వాహనంలో సోమును వెంబడించారు. సినీ ఫక్కీలో చేజింగ్ జరుగుతుండగా వంశీ ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో పోలీసు వాహనం ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఈలోగా వెనుకనుంచి వచ్చిన పో లీసులు సోమును అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు తమ వాహనం దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ముగ్గురు యు వకులు మద్యం మత్తులో అర్ధరాత్రి వీరంగం సృష్టించడం సంచలనం కలిగించింది. ఆ యు వకులను అరెస్టుచేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ సదానాగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment