నగరంలో నిలిచిన ఆర్టీసీ బస్సులు
ప్రశాంతంగా సార్వత్రిక సమ్మె
* తీవ్ర ఇబ్బందులుపడ్డ ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో సార్వత్రిక సమ్మె శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన కార్మిక సంఘాలు కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సంపూర్ణ మద్దతునివ్వడంతో నగరంలోని అన్ని డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. సుమారు 3,500 బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. ఎంజీబీఎస్, జేబీఎస్‌ల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వివిధ ప్రాంతాలకు వెళ్లే వారిపై ప్రైవేటు వాహనదారులు నిలువుదోపిడీకి పాల్పడ్డారు. ఆటో కార్మిక సంఘాలు బంద్ ప్రకటించినప్పటికీ చాలాచోట్ల ఆటోరిక్షాలు యథావిధిగా నడిచాయి. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఎంఎంటీఎస్ రైళ్లు కిటకిటలాడాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రతిరోజు నడిచే 121 సర్వీసులతో పాటు మరో 14 రైళ్లు అదనంగా నడిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. చాలాచోట్ల స్కూళ్లకు ముందుగానే సెలవు ప్రకటించారు.
నిరసనల హోరు...
బాగ్‌లింగంపల్లి నుంచి ఇందిరాపార్కు వరకు అన్ని ప్రధాన కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహిం చాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పెద్దఎత్తున నినాదా లు చేశారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ తదితర సంఘాలన్నీ ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. నాంపల్లిలోని గగన్‌విహార్‌లో జరిగిన నిరసన సభలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షులు దేవీప్రసాద్, అధ్యక్షులు కారెం రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొని ఉద్యోగుల నిరసనకు మద్దతు ప్రకటించారు.
పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని, కాంట్రిబ్యూటరీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె పెద్ద ఎత్తున విజయవంతమైందని పేర్కొన్నారు. జిల్లాల్లోనూ సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. మరోవైపు కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె ఏపీలో ప్రశాంతంగా ముగిసింది.