మీడియాతో మాట్లాడుతున్న ఉద్యోగ జేఎసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెకు మద్దతు కావాలని ఉద్యోగ జేఏసీని ఎన్నడూ కోరలేదని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. మద్దతు కావాలని అడగనప్పుడు తాము ఎలా స్పందిస్తామని ప్రశ్నించింది. ఉద్యోగ జేఏసీలో ఆర్టీసీ జేఏసీ భాగం కాదని, వారి ఉద్యోగ నిబంధ నలు కార్మిక చట్టాలకు లోబడి ఉంటాయని, ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు సీసీఏ నిబంధనల ప్రకారం ఉంటా యని పేర్కొంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏంటో ఉద్యోగ జేఏసీ దృష్టికి తీసుకొస్తే వాటిపై చర్చించిన తర్వాతే మద్దతుపై ప్రకటన చేయనున్నట్లు తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆదివారం ఉద్యోగ జేఏసీ నేతలు టీఎన్జీవో భవన్‌లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
ఉద్యోగ జేఏసీ చైర్మన్ కె.రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వి.మమత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కొందరు పనిగట్టుకుని ఉద్యోగ జేఏసీని, టీఎన్జీవో, టీజీవోలను బదనాం చేస్తున్నారని, ఆర్టీసీ జేఏసీ మద్దతు కోసం ఇప్పటివరకు తమను సంప్రదించలేదన్నారు. సమ్మెకు మద్దతు కోరేందుకు ఆదివారం టీఎన్జీవో భవన్‌కు వస్తామని సమా చారం ఇచ్చిందని.. కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నట్లు ఆర్టీసీ జేఏసీ చెప్పిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి 16 అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులు తమను సంప్రదిస్తే వారి సమస్యను 17వ అంశంగా ప్రస్తావిస్తామని, కొందరు ఉద్దేశపూర్వకంగా తమపై బురద జల్లితే సహించేది లేదన్నారు.
తప్పుడు ప్రచారం తగదు..
ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ తమను ఆహ్వానించారని, భోజన సమయం కావడంతో అందులో తాము పాల్గొన్నామని రవీందర్‌రెడ్డి, మమత పేర్కొన్నారు. దీనిపై తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు చర్చల తోనే పరిష్కారం దొరుకుతుందని, ఇందులో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుని ప్రభుత్వంపై కక్షసాధింపు ధోరణితో సమ్మెను నడిపిస్తున్నాయని ఆరోపించారు. ఉద్యోగ జేఏసీ ఎన్నడూ రాజకీయ పార్టీల మద్దతు కోరదని, ఆర్టీసీ కార్మికులు కూడా రాజకీయ పార్టీలతో కాకుండా జేఏసీ తరఫున ఉద్యమించాలని సూచించారు. తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కార్మికులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment