పండక్కి బండెక్కలేమా? | TSRTC Employees Union Decides To Call Strike From 5th October | Sakshi
Sakshi News home page

పండక్కి బండెక్కలేమా?

Published Mon, Sep 30 2019 2:49 AM | Last Updated on Mon, Sep 30 2019 10:24 AM

TSRTC Employees Union Decides To Call Strike From 5th October - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సై అన్నారు. వచ్చే నెల ఐదో తేదీ నుంచి సమ్మె సైరన్‌ మోగనుంది. ఈ మేరకు కార్మిక సంఘాలు నిర్ణయిం చాయి. ఆరోజు ఉదయం 5గంటల నుంచే బస్సులను నిలిపి వేయనున్నట్టు ప్రకటించాయి. 4న కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలతో రాజీ చర్చలున్న విషయం తెలిసిందే. సమావేశ ఫలితం సానుకూలంగా లేని పక్షంలో సమ్మెకు వెళ్లే తేదీని ప్రకటించాలి. సమావేశం జరిగిన వారం తర్వాత సమ్మె చేసేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. కానీ, ఈసారి ప్రభుత్వంపై ఒత్తిడిని ఒక్కసారిగా పెంచే ఉద్దేశంతో సరిగ్గా దసరా ప్రయాణాలు ఉధృతంగా ఉన్న సమయంలో సమ్మెకు దిగాలని సంఘాలు నిర్ణయించాయి. రాజీ చర్చలతో ప్రమే యం లేకుండా, ఆ సమావేశానికి ముందు గానే సమ్మె తేదీని ప్రకటించటం విశేషం. 

సమ్మె నోటీస్‌ గడువు ముగిసినా..
కార్మిక సంఘాలు 20 రోజుల క్రితమే ఒకదాని తర్వాత ఒకటి చొప్పున ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చాయి. సమ్మె నోటీసు గడువు 14 రోజులు ముగిసినా ప్రభుత్వం స్పందించకపోవటం, కార్మిక శాఖ గత సోమవారం నిర్వహించాల్సిన రాజీ చర్చలను వాయిదా వేసి తదుపరి తేదీ ప్రకటించకపోవటంతో కార్మిక సంఘాలు అప్రమత్తమయ్యాయి. 3 రోజుల్లో రాజీ చర్చల తేదీని ప్రక టించకుంటే సమ్మెకు సిద్ధమవుతామంటూ కార్మిక శాఖకు లేఖ రాసినట్టుగా గుర్తింపు కార్మికసంఘం ప్రతినిధి థామస్‌రెడ్డి వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో సద్దుల బతుకమ్మకు రెండురోజుల ముందు రాజీ చర్చలుంటాయని కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ ప్రకటించారు. అంటే, దసరా కోసం జనం సొంతూళ్లకు దాదాపు చేరుకుంటారు. సమావేశం ముగిసిన తర్వాత వారం వరకు సమ్మె చేసే వెసులుబాటులేదని నిబంధనలు చెబుతున్నందున, ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి తమ స్థానాలకు చేరుకుంటారు. దసరా ప్రయాణాల సమయంలో బస్సులు నిలిపేస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రభుత్వం కచ్చితంగా స్పందిస్తుందన్న ఉద్దేశంతో కార్మిక సంఘాలు దసరా సెలవులకు జనం ఊళ్లకు వెళ్లే రోజైన 5న సమ్మెకు సై అన్నాయి.

సమ్మెకు ఏర్పాట్లు
ఆదివారం చర్చించుకున్న రెండు జేఏసీలు ఈమేరకు తీర్మానించి సమ్మె తేదీని ప్రకటించాయి. గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ఉన్న జేఏసీ, ముందుగా సమ్మె నోటీసు ఇచ్చిన టీజేఎంయూ ఉన్న జేఏసీ–1లు ఆదివారం సాయంత్రం సమ్మె తేదీని వెల్లడించాయి. గుర్తింపు సంఘం సమ్మెకు దిగాలని, దానికి మద్దతు ఇస్తామని ఒత్తిడి చేసిన ఎన్‌ఎంయూ కూడా మద్దతు ప్రకటించింది. దీంతో అన్ని సంఘాలు సమ్మె ఏర్పాట్లు ప్రారంభించాయి. మరోవైపు గుర్తింపు కార్మిక సంఘంతో కూడిన జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నాచౌక్‌ వద్ద సామూహిక నిరాహార దీక్షలు, బహిరంగ సభ నిర్వహించబోతోంది. 

ప్రభుత్వమే కారణం
‘ఆర్టీసీలో సమ్మె రావటానికి ప్రభుత్వ తీరే కారణం. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. సంస్థను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, మా సమస్యలు పరిష్కరించటం లేదు. తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు వెళ్లాల్సివస్తోంది. ప్రయాణికుల ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’అని జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి అన్నారు. ‘న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ సమ్మెకు కారణమవుతోంది. 

సంస్థ నష్టాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నా ప్రభుత్వం స్పందించడంలేదు. మా నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి’అని జేఏసీ–1 కన్వీనర్‌ హనుమంతు తెలిపారు. ‘ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఆర్టీసీని గాలికొదిలేసి దివాలా తీసే పరిస్థితికి కారణమైంది. దాన్ని పరిరక్షించుకునేందుకే మేం సమ్మె చేస్తున్నాం. జేఏసీకి మా సంపూర్ణ మద్దతు ఇస్తున్నం’అని ఎన్‌ఎంయూ నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. 

విచ్చిన్నం చేసే కుట్ర చేస్తే సహించేది లేదు
సుందరయ్యవిజ్ఞానకేంద్రం:  ‘ఆర్టీసీలో దాదాపు అన్ని సంఘాలు నోటిసులు ఇచ్చినా స్పందించకపోవటం వల్లే సమ్మెకు పూనుకున్నాం. మొత్తం 51 వేల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారు. దసరా పండుగ ఉన్నప్పటికి సమ్మె చేస్తున్నందున ప్రజలు అర్థం చేసుకొని మాకు మద్దతు తెలుపాలి. సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర చేస్తే సహించేది లేదు. ఆర్టీసి అధికారులు సైతం సమ్మెకు సంఘీభావం తెలపాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 5 నుంచి నిరవధిక సమ్మెను చేస్తున్నాం’అని టీఎస్‌ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ స్పష్టం చేసింది. 

ఆదివారం బస్‌ బవన్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ కన్వీనర్‌ ఇ.అశ్వత్థామరెడ్డి, కో–కన్వీనర్లు కె.రాజిరెడ్డి, వి.ఎస్‌.రావులు మాట్లాడుతూ కార్మిక సంఘాలతో మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయకపోవటం బాధాకరం అన్నారు. కార్యక్రమంలో కో–కన్వీనర్‌ శ్రీధర్, టీఎంయూ అధ్యక్షుడు థామస్‌ రెడ్డి, నేతలు రవీందర్‌రెడ్డి, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement