పంథా మార్చిన కార్మిక సంఘాలు | TSRTC Employees Protest To Attract People | Sakshi
Sakshi News home page

పంథా మార్చిన కార్మిక సంఘాలు

Published Tue, Oct 8 2019 5:02 AM | Last Updated on Tue, Oct 8 2019 5:02 AM

TSRTC Employees Protest To Attract People - Sakshi

నల్గొండలో చిందు యక్షగానం ప్రదర్శన ద్వారా నిరసన వ్యక్తపరుస్తున్న ఆర్టీసీ కార్మికులు

సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు ఆర్టీసీని సమూలంగా మార్చేందుకు సీఎం కీలకనిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తుండగా, మరోవైపు పట్టువీడకుండా కార్మికసంఘాలు సమ్మెను ముమ్మరం చేశాయి. సోమవారం మూడోరోజు కూడా ఉద్యోగులు విధుల్లో పాల్గొనకుండా సంపూర్ణ సమ్మెను చేపట్టారు. ఓ వైపు సమ్మె జరుపుతూనే మరోవైపు ముఖ్యమంత్రి నిర్ణయాలపై నిరసనలు వ్యక్తం చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మూడోరోజు సమ్మెతో ప్రయాణికులు పెద్దగా ఇబ్బంది పడనప్పటికీ, చాలాచోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం సాయం త్రం నాలుగు గంటల వరకు 5,386 బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 48.51% బస్సులు తిప్పినట్టు అధికారులు ప్రకటించారు.

రెండు రోజులతో పోలిస్తే సోమవారం ఉదయం నుంచే అన్ని బస్టాండ్లు బస్సులతో నిండిపోయాయి. నగరంలోని ఇమ్లీబన్‌కు ఉదయం పది గంటల వేళ దాదాపు 300 బస్సులు రావటంతో వాటిని నిలిపేస్థలం లేక ప్లాట్‌ఫామ్స్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. బస్సులెక్కువ ఉన్నా, ప్రయాణికుల సంఖ్య పలచగా ఉంది. దసరాను జరుపుకొనేందుకు చాలామంది నగరవాసులు ఊళ్లకు చేరిపోవటంతో సోమవారం రద్దీ పెద్దగా కనిపించలేదు. దీన్ని గుర్తించి అధికారులు ప్రైవేటు బస్సులను కొంతమేర తగ్గించారు. 3,063 మంది వంతున తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను వినియోగించారు.  గ్రామీణ ప్రాంతాలకు మాత్రం తక్కువసంఖ్యలో బస్సులు నడవటంతో అటు వెళ్లాల్సినవారు ఇబ్బందిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు పెద్దసంఖ్యలోనే నడిచినా, నగరంలో మాత్రం సిటీ బస్సులకు కొరత వచ్చింది. దీంతో ఆటోలు, క్యాబ్‌లు 3 రెట్లు చార్జీ పెంచి దోచుకున్నారు.  

మారిన పంథా.... :  రెండు రోజులు సమ్మెను విజయవంతం చేసేందుకు యత్నించిన కార్మిక సంఘాలు సోమవారం జనం దృష్టిని ఆకర్షించేందుకు యత్నించాయి. ఆదివారం సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకోవటంతో కార్మికనేతలు పంథా మార్చారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులందరినీ తొలగిస్తామని, 50% ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేస్తామన్న కీలక నిర్ణయాలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ముందుగా ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. ఆదివారమే దీన్ని ప్రకటించారు.

సీఎం సమీక్ష నేపథ్యంలో పోలీసులు ఆ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో కార్మిక సంఘాల నేతలు గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అక్కడే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. వారు ఉదయం వచ్చేసరికే అక్కడ భారీగా పోలీసులను మోహరించి వచ్చినవారిని వచ్చినట్టుగా అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. నివాళులు కూడా అర్పించనీయకపోవటంతో కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదుపులోకి తీసుకున్నవారిని మధ్యాహ్నం వదిలిపెట్టారు. అనంతరం వారు భేటీ అయి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. 

గన్‌పార్క్‌ వద్ద జేఏసీ నేత అశ్వత్థామరెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

కార్మికుల భయాందోళన 
మరోవైపు సీఎం నిర్ణయంతో కార్మికులు కలవర పడ్డారు. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనతో వారు కార్మిక నేతలకు ఫోన్లు చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో న్యాయ సలహా తీసుకుందామని, అన్ని వేలమంది ఉద్యోగాలు తొలగించటం సాధ్యం కాదని, దానికీ ఓ విధానం ఉంటుందని, ప్రభుత్వం దాన్ని అనుసరించకుండా పత్రికాప్రకటనగా వెల్లడించటం చెల్లదంటూ వారు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అంతిమంగా కార్మికులదే విజయమని భరోసా ఇచ్చారు. వీరికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.ఆర్టీసీ పరిరక్షణ పోరాటాన్ని కాస్త ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంగా మారుస్తున్నట్టు నేతలు వెల్లడించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 672 బస్సులకుగాను 515 బస్సు లు నడిపించారు.

అన్ని ప్రాంతాల్లో ఆదాయం దారుణంగా పడిపోయింది. ఒకరోజు రూ.50 లక్షలకు బదులు రూ.20 లక్షలు కూడా ఈ రీజియన్‌లో రాలేదు. ఇది అన్ని జిల్లాల్లో ఏర్పడ్డ సమస్య. ప్రైవేటు సిబ్బంది వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని ఆర్టీసీకి జమ చేయటం లేదు. కొంతే కడుతున్నారు. టికెట్ల అమ్మకం లేనందున లెక్కలు తెలియటం లేదు. వారు ఎంత ఇస్తే ఆర్టీసీ సిబ్బంది అంత తీసుకోవాల్సి వస్తోంది. అల్లాదుర్గం మండ లం ముస్లాపూర్‌ శివారులో ఓ బస్సు అద్దాలను ఆగంతకులు ధ్వంసం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 440 బస్సులు తిరిగాయి. టికెట్‌ ధరలను రెట్టింపు చేయటంతో ప్రైవేటు కండక్టర్లతో ప్రయాణికుల వాగ్వాదం కనిపించింది.  

►ఖమ్మం జిల్లాలో... 
ఖమ్మం జిల్లా పరిధిలోని డిపోల నుంచి బయటకు వచ్చిన బస్సులను కార్మికులు అడ్డుకున్నారు. నాలుగు బస్సులను అడ్డుకుని టైర్ల గాలి తీయడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement