
సాక్షి, హైదరాబాద్: గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ప్రభుత్వం తరఫున మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చారు. ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కేకే మధ్యవర్తిత్వాన్ని స్వాగతించాయి. ఈ నేపథ్యంలో సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికుల ముందు కేకే పలు కీలక ప్రతిపాదనలు ఉంచినట్టు తెలుస్తోంది. కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని ఆయన సూచించారు. ఈ విషయమై మంగళవారం కల్లా కార్మిక సంఘాలు తమ అభిప్రాయాన్ని చెప్పనున్నాయి. కార్మిక సంఘాల అభిప్రాయం చెప్తే.. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. చర్చలు జరిపి పరిష్కరిస్తానని కేకే కార్మికులకు హామీ ఇచ్చినట్టు సమాచారం.
కేకే ప్రకటనతో ముందడుగు..
కార్మికుల సమ్మె నేపథ్యంలో కేకే సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. పరిస్థితులు చేయిదాటకముందే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించుకొని చర్చలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పరిష్కరించిందని గుర్తుచేస్తూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆర్టీసీతోపాటు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన లేదని, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే అంశం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కేశవరావు విజ్ఞప్తి చేశారు.
కేకే ప్రకటనను కార్మిక సంఘాలు స్వాగతించాయి. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున మధ్యవర్తిత్వం వహించాలని కోరాయి. కేకే మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వానించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరారు. ఇందుకు కేకే సమ్మతించడంతో ఆర్టీసీ సమ్మె పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడినట్టు అయింది.
Comments
Please login to add a commentAdd a comment