సాక్షి, హైదారాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను తొలగిస్తూ .. సంస్థలో ఇక మిగిలింది1200 మంది ఉద్యోగులు మాత్రమే అని ప్రకటించి విషయం తెలిసిందే. తాజాగా కొత్త ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకాలు చేపడతామని ప్రకటించారు. ఈ మేరకు కొత్త నియామకాలకై అధికారులు కసరత్తు ప్రారంభించారు. అన్ని డిపో మేనేజర్లతో రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త అద్దె బస్సులు, నోటిఫికేషన్‌పై చర్చించారు. రేపటి నుంచి మరిన్ని బస్సులను పెంచాలని అధికారులను ఆదేశించారు. బస్‌పాసులను కచ్చితంగా అనుమతి ఇచ్చేలా తాత్కాలిక, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఆదేశాలివ్వాలని సూచించారు. ప్రయాణికుల రద్దికి తగ్గట్టుగా బస్సులను ఏర్పాటు చేసుకోవాలని డిపో మేనేజర్లకు సూచించారు. మరో 10 రోజుల్లో ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు.
ఇష్టారాజ్యంగా డబ్బు వసూలు
ఆర్టీసీ కార్మికుల సమ్మే నేపథ్యంలో ప్రైవేట్ వాహనదారులు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పండగ వేళ గ్రామాల నుంచి పట్టణాలకు తిరుగు ప్రయాణమయ్యే వారికి ఇబ్బంది కాకుండా 5వేలకు పైగా ఆర్టీసీ బస్సులను రోడెక్కించారు. ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్ల ద్వారా ఆర్టీసీ సేవలు అందిస్తున్నారు. అయితే వారు మాత్రం ప్రయాణీకుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. టికెట్లు ఇవ్వకుండానే ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఇక పండగకు ఊరెళ్లి తిరిగి వస్తున్న నగర వాసులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాల నుంచి ఎలాగోలా జూబ్లీబస్టాండ్ చేరుకున్నా.. అక్కడి నుంచి సీటీలోకి వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రెట్టింపు డబ్బులు ఇచ్చి సిటీలోకి వెళ్తున్నారు. సమ్మె విషయంలో అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో పండగ వేళ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమ్మె విస్తృతం చేస్తామంటున్న కార్మిక జేఏసీ
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజుకు చేరింది. అయినప్పటీకి ప్రభుత్వం దిగిరాకపోవడంతో తమ సమ్మెను విస్తృతం చేసేందుకు ఆర్టీసీ జేఏసీ ప్రణాళిక రచిస్తోంది.వంట వార్పు, తెలంగాణ బంద్, గవర్నర్, కేంద్ర మంత్రులను కలవడం లాంటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment