సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు సర్కారు షాక్‌ | Telangana Government Decides To Dismiss RTC Employees Who Is In Strike | Sakshi
Sakshi News home page

సమ్మెపై సమ్మెట

Published Mon, Oct 7 2019 2:55 AM | Last Updated on Mon, Oct 7 2019 11:17 AM

Telangana Government Decides To Dismiss RTC Employees Who Is In Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ షాక్‌ ఇచ్చారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సమ్మెకు దిగిన కార్మికులతో ఇకపై ఎలాంటి చర్చలూ జరపబోమని తేల్చి చెప్పారు. సమ్మెకు దిగిన కార్మికులు, ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోబోమని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన నిర్ణయాలు ప్రకటించారు. 

‘‘సంవత్సరానికి రూ.1200 కోట్ల నష్టం, రూ.ఐదు వేల కోట్ల రుణభారం, క్రమం తప్పకుండా పెరుగుతున్న డీజిల్‌ ధరలతో పడుతున్న భారం.. ఇన్ని ఇబ్బందులతో ఆర్టీసీ ఉంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా చట్టవిరుద్ధంగా సమ్మెకు దిగి దసరా సమయంలో జనాన్ని ఇబ్బంది పెట్టినవారితో ఎలాంటి రాజీకి రాబోం. సగటున ఆర్టీసీ సిబ్బందికి నెలకు రూ.50వేల జీతం వస్తున్నా ఇంకా పెంచమని అడగడంలో అర్థంలేదు. ఈ యూనియన్‌ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు ప్రభుత్వం తల వంచదు. ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లో చేరని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదు. సమ్మె చేస్తున్నవారు పోను ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం పన్నెండొందలలోపు మాత్రమే ఉన్నారు’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

సగం అద్దె బస్సులు.. సగం సొంత బస్సులు..
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్న కేసీఆర్‌.. ఏకంగా సమ్మెలో ఉన్నవారిని తొలగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించుకోనున్నట్టు పేర్కొన్నారు. తాజా సమ్మెను బ్లాక్‌మెయిలింగ్‌ వ్యవహారంగా అభివర్ణించిన ఆయన.. భవిష్యత్తులో ఆర్టీసీకి ఆ సమస్య రాకుండా చూడాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం కొన్ని కీలక నిర్ణయాలు తప్పవని, ఆ దిశలో ఆర్టీసీని సమూలంగా మార్చనున్నట్టు ప్రకటించారు. ఇక ఆర్టీసీలో సగం సొంత బస్సులు ఉంటే, మిగతా సగం ప్రైవేటు బస్సులుంటాయని వెల్లడించారు. 

దీనివల్ల సంస్థ పనితీరు బాగుంటుందని, బస్సులు బాగా నడుస్తాయని, రెండు మూడేళ్లలో నష్టాలు పూడ్చుకుని సంస్థ లాభాల్లోకి చేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ఆర్టీసీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నం. సంస్థ మనుగడ ఉండటమే కాదు లాభాల్లోకి వెళ్లాలి. ఇందుకు కొన్ని చర్యలు తప్పవు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు. సమ్మె చేస్తున్నవారితో చర్చించం. భవిష్యత్‌లో కూడా సంస్థలో ఎప్పటికీ క్రమశిక్షణ రాహిత్యం, బ్లాక్‌ మెయిలింగ్‌ వ్యవహారం, తలనొప్పి కలిగించే చర్యలు లేకుండా చేయాలని భావిస్తున్నం. 

గత నలభై సంవత్సరాలుగా ఆర్టీసీ చుట్టూ అల్లుకున్న వ్యవహారం నిరంతర సమస్యగా పరిణమించింది. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అనేక రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది. ఈ తరుణంలో ఆర్టీసీ సమ్మెల్లాంటివి ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసేలా మారాయి. తాజా సమ్మె చట్టవ్యతిరేకం, బాధ్యతారాహిత్యం. మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మణిపూర్‌ రాష్ట్రాల్లో ఆర్టీసీ లేనే లేదు. బిహార్, ఒడిశా, జమ్మూ, కశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో నామమాత్రంగా ఉంది. అలా చూస్తే కర్ణాటక తర్వాత తెలంగాణలోనే  అత్యధికంగా బస్సులు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఆర్టీసీని ఇంత మంచిగా చూసుకుంటుంటే వారు సమ్మెకు దిగడం అవసరమా?’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 

ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సమతౌల్యం పాటించాలని అభిప్రాయపడ్డారు. ఒకపక్క ప్రైవేటు భాగస్వామ్యం, మరోపక్క ఆర్టీసీ యాజమాన్యం ఉంటే మంచిదని పేర్కొన్నారు. సమ్మె విషయంలో జనం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, సోషల్‌ మీడియాలో వారి స్పందనే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. సమ్మె వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించినందున వారిని ఎట్టి పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకోబోమన్నారు. గడపదాటితే బయటికే.. మళ్లీ గడపలోకి వచ్చే సమస్యే లేదని కుండబద్దలు కొట్టారు.

త్వరలో కొత్త నియామకాలు...
సమ్మెలో ఉన్నవారిని తిరిగి తీసుకునే వీలు లేనందున త్వరలోనే వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టనున్నట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరబోమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. వారి నియామకం షరతులతో కూడుకుని ఉంటుందని, ప్రొబేషన్‌ పిరియడ్‌ కూడా అమలవుతుందని పేర్కొన్నారు. ఏయే కేటగిరీకి చెందిన సిబ్బంది సమ్మెలో ఉన్నారో వారి స్థానాలను ఖాళీలుగా భావించి భర్తీ ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. 

విలీనంపై వారికి మాట్లాడే హక్కు లేదు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంలో అఖిలపక్ష సమావేశం జరపాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారని, ఆయా పార్టీలకు ఆర్టీసీపై మాట్లాడే హక్కే లేదని సీఎం వ్యాఖ్యానించారు. సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్, కేరళల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని ప్రశ్నించారు. బీజేపీ ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా, అక్కడ ఎందుకు చేయలేదని అడిగారు. మరి కాంగ్రెస్‌ ఏం చేసిందని నిలదీశారు. అందుకే వాళ్లకు విలీనంపై అడిగే హక్కు లేదని అంటున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందరి కళ్ళూ తెరిపించాలని పేర్కొన్నారు. 

సమ్మె నేపథ్యంలో తక్షణ చర్యగా 2,500 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుని నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుబాటులో ఉన్న 4,114 ప్రైవేటు బస్సులను పర్మిట్లతో స్టేజ్‌ క్యారియర్లుగా మారిస్తే అవి కూడా ఆర్టీసీ పరిధిలోకి వస్తాయన్నారు. ఈ విషయంలో బస్సుల నిర్వాహకులతో ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో 1,22,58,433 వివిధ రకాల ప్రైవేట్‌ వాహనాలున్నాయి. ఇవన్నీ ప్రజల రవాణాకు ఉపయోగపడేవే. ఆర్టీసీలో ఉన్న యాజమాన్య నైపుణ్యాన్ని చక్కగా వాడుకోవాలి. ఆర్టీసీ సరుకు రవాణా ద్వారా కూడా లాభాలు రాబట్టాలి. 

ఈ పోటీ ప్రపంచంలో వినూత్నంగా ఆలోచించి సంస్థను లాభాల్లోకి తీసుకురావాలి. అనేక రంగాలలో ముందున్న తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీలో కూడా ముందుండాలి. తెలంగాణ గొప్ప రాష్ట్రంగా తయారుకావడమే నాకు అన్నింటికంటే అధిక ప్రాధాన్యమైన అంశం. ఒక అద్భుతమైన, గొప్పదైన, సమర్ధమైన లాభాల బాటలో నడిచే సంస్థగా ఆర్టీసీ రూపుదిద్దుకోవాలి. హైదరాబాద్‌ నగరానికి చెందినంత వరకు నష్టాలను ప్రభుత్వం భరిస్తుంది’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

పక్షం రోజుల్లో పూర్వస్థితికి.. 
సమ్మె నేపథ్యంలో పరిస్థితి అతలాకుతలంగా ఉన్న నేపథ్యంలో కేవలం 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి నివేదిక సమర్పించడానికి రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌ సుల్తానియా, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పాండురంగనాయక్‌ ఉన్నారు. సోమవారంనాటికి ఈ కమిటీ నివేదిక అందించాలని సీఎం ఆదేశించారు. 

సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌ నర్సింగ్‌రావు, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, రవాణాశాఖ కమీషనర్‌ సందీప్‌ సుల్తానియా, అడిషనల్‌ డీజీపీ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement