సమ్మె తీవ్రం.. సర్కారు ‘చక్రం’ | TSRTC Indefinite Strike Begins Buses Go Off Roads In Telangana | Sakshi
Sakshi News home page

సమ్మె తీవ్రం.. సర్కారు ‘చక్రం’

Published Sun, Oct 6 2019 3:53 AM | Last Updated on Sun, Oct 6 2019 10:28 AM

TSRTC Indefinite Strike Begins Buses Go Off Roads In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దసరా పండుగ సరదాగా చేసుకునేందుకు పిల్లాపాపలతో ఊళ్లకు బయలుదేరిన వారికి శనివారం ప్రయాణం నరకప్రాయమే అయింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉదయం వేళ డిపోల నుంచి ఒక్క బస్సు కూడా ప్లాట్‌ఫారంల పైకి రాలేదు. ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చినా ఆచరణ సాధ్యం కాలేదు.  బస్సుల్లేకపోవటాన్ని ఆసరా చేసుకున్న ప్రైవేటు వాహనదారులు ధరలను మూడు, నాలుగు రెట్లు పెంచి జేబులు గుల్లచేశారు. వరంగల్‌ నుంచి కరీంనగర్‌ వెళ్లేందుకు రూ.400 వరకు వసూలు చేశారు.

10 గంటల తర్వాత మార్పు..
ఉదయం 10 గంటల నుంచి పరిస్థితిలో కొంత మార్పు మొదలైంది. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు మెల్లగా అందుబాటులోకి వస్తుండటంతో బస్సులు డిపోల నుంచి బయటకు వచ్చాయి. మధ్యాహ్నం వరకు దాదాపు 45 శాతం బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీ బస్సులు, అద్దె బస్సులతోపాటు జీపులు, వ్యాన్లు, విద్యాసంస్థల బస్సు లు.. ఇలా అన్ని రకాల వాహనాలను అందుబాటు లోకి తేవటంతో ప్రయాణాలు సాధారణంగా సాగిపోయా యి. మహబూబ్‌నగర్, ఖమ్మం లాంటి కొన్ని ప్రాంతాల్లో ఉదయం రద్దీ ఎక్కువగా కనిపించినా, సమ్మె ప్రభావం   ఉందని, బస్సుల్లేవన్న సమాచారంతో బస్టాండ్లకు జనం రాక తగ్గిపోయింది. కానీ మధ్యాహ్నం తర్వాత మళ్లీ రద్దీతో బస్సులు కదిలాయి. శనివారం నుంచి సమ్మె ఉం డటంతో పలువురు శుక్రవారమే ఊళ్లకు వెళ్లిపోయారు. ఎక్కువ మంది ఆది, సోమవా రాల్లో ఊళ్లకు వెళ్లే అవకాశముంది. ఈ రెండు రోజులు ప్రత్యామ్నాయ బస్సులు తగ్గితే తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

అందుబాటులో 9 వేల బస్సులు
ఉదయం ప్రైవేటు డ్రైవర్లకు ఆర్టీసీ, రవాణ శాఖ అధికా రులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. వారితో ఒక్క రౌండు బస్సు నడిపించి.. వారి డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని అంచనా వేశారు. వారిలో ఉత్తీర్ణులైన వారిని డిపోలకు పంపి, బస్సులు చేతికిచ్చారు. ఈ ప్రక్రియకు నాలుగైదు గంటల సమయం పట్టింది. ఇలా క్రమంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 9 వేల బస్సులను అధికారులు రోడ్డెక్కిం చగలిగారు. ఇందులో సాధారణ ఆర్టీసీ బస్సులు 2,129, ఆర్టీసీలోని అద్దె బస్సులు 1,717 ,ప్రైవేటు వాహనాలు 1,155, విద్యా సంస్థల బస్సులు 1,195, మ్యాక్సీ క్యాబ్‌ సర్వీసులు 2,778 అందుబాటులోకి తెచ్చారు. ఆదివారం నాటికి ఈ సంఖ్యను మరింత పెంచుతామని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ వెల్లడించారు.

ఆదుకున్న ఏపీ బస్సులు
శనివారం పెద్ద సంఖ్యలో ఏపీ బస్సులు ఇమ్లీబన్, దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్ల నుంచి సేవలందించాయి. దాదాపు 2 వేల మేర బస్సులు అదనంగా వచ్చాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారికి కొంత ఊరట లభించింది. మరో ఐదారు రోజుల పాటు ఏపీ బస్సులు తిరగనున్నాయి. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర అధికారులతో మన అధికారులు మాట్లాడారు. ఆదివారం మరో 2 వేల బస్సులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డిపోల్లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు డిపో మేనేజర్లకుతోడు లేకుండా పోయింది. ఆదివారం వరకు రిటైర్డ్‌ అధికారులను అందుబాటులోకి తేనున్నారు. కాగా, ప్రైవేటు కండక్టర్లతో తిప్పిన బస్సుల్లో టికెట్ల జారీ కనిపించలేదు. కొన్ని బస్సుల్లో సాధారణ టికెట్‌ ధర వసూలు చేయగా, మరిన్ని బస్సుల్లో అదనపు మొత్తం వసూలు చేశారు. తమకు టికెట్‌ ట్రేలనే ఇవ్వలేదని కండక్లర్లు చెప్పటం విశేషం.

‘డిస్మిస్‌’హెచ్చరిక పట్టించుకోని సిబ్బంది
శనివారం సాయంత్రం 6 గంటలలోపు విధుల్లోకి రాని సిబ్బంది డిస్మిస్‌ అయినట్లే భావించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికను కార్మికులు, ఉద్యోగులు పట్టించుకోలేదు. సమ్మెలో ఉన్న వారిలో 165 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. వారిలో ఎక్కువ మంది అధికారుల కార్ల డ్రైవర్లు, ఆఫీసు చిరుద్యోగులే కావటం విశేషం. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 7 డిపోలకు సంబంధించి 3,067మంది కార్మికులు సమ్మెలో ఉన్నారు. యాదాద్రి జిల్లా పరిధిలో 37 ఆర్టీసీ బస్సులు, మరో 15 ప్రైవేటు బస్సులను తాత్కాలిక డ్రైవర్లుతో నడిపించారు. సూర్యాపేట జిల్లాలో 67 ఆర్టీసీ, 40 అద్దె బస్సులను, నల్లగొండలో 118 ఆర్టీసీ, 90 అద్దెబస్సులను నడిపారు. మొత్తంగా 227 ఆర్టీసీ బస్సులు, 145 అద్దెబస్సులను నడిపించారు.

యాదగిరిగుట్టలో తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు తీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.   ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 8 డిపోల పరిధిలో 672 ఆర్టీసీ బస్సులకు మధ్యాహ్నం తర్వాత 449 బస్సులు రోడ్డెక్కాయి. సిద్దిపేట డిపోకు చెందిన కండక్టర్‌ గురుచరణ్‌.. ప్రజ్ఞాపూర్‌ చౌరస్తాలో హోర్డింగ్‌ పైకి ఎక్కి నిరసన తెలిపారు. హుస్నాబాద్‌లో రెండు ఆర్టీసీ బస్సులు, సంగారెడ్డి జిల్లాలో కందిలో మరో బస్సు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మహబూబాబాద్‌ డిపోలో 74 బస్సులకు 38 బస్సులు, తొర్రూరులో 88 బస్సులకు 45 బస్సులు నడిచాయి. మహబూబాబాద్‌ డిపోకు చెందిన డ్రైవర్‌ బానోతు లాలు పెట్రోల్‌ పోసు కుని ఆత్మహత్యాయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.  

రాజధానిలో ఇలా..
హైదరాబాద్‌లో మూడున్నర వేల సిటీ బస్సులు పరుగులు పెట్టేవి. శనివారం 780 బస్సులను మాత్రమే తిప్పగలిగారు. తాత్కాలిక పర్మిట్లతో 2 వేల వాహనాలను అందుబాటులోకి తెచ్చి దూరప్రాంతాలకు తిప్పడంతో ఇమ్లీబన్, జూబ్లీ బస్టాండ్లలో మధ్యాహ్నం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. మెట్రో రైళ్ల సంఖ్య పెంచాలని మెట్రో కార్పొరేషన్‌ను కోరటంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. మెట్రో రైళ్లలో రోజువారీ 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా, శనివారం 4 లక్షలు దాటింది. ఎంఎంటీఎస్‌ సర్వీసులూ పెంచారు. పరిగిలో వికారాబాద్‌ వైపు వెళ్తున్న బస్సు అద్దాలను ఆగంతకులు ధ్వంసం చేశారు. అనుభవం లేని డ్రైవర్లు కావటంతో కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పలేదు.

బస్‌ పాసులు చెల్లుతాయి..
బస్‌ పాసులను ప్రైవేటు డ్రైవర్లు నడిపే ఆర్టీసీ బస్సుల్లో అంగీకరించట్లేదని, టికెట్‌ డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కానీ బస్‌ పాసులపై ఎలాంటి నిషేధం విధించలేదని, యథావిధిగా బస్‌పాసులు చెల్లుతాయని స్పష్టం చేశారు. 

సమ్మె విరమించే ప్రసక్తే లేదు
సాక్షి, హైదరాబాద్‌: తమ డిమాండ్లు నెరవేరేవరకూ సమ్మెను విరమించేది లేదని ఆర్‌టీíసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ అధ్యక్షుడు అశ్వత్ధామరెడ్డి స్పష్టం చేశారు.  సమ్మె తొలిరోజు సంపూర్ణ విజయవంతమైందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. కనీసం ఒక్క శాతం మంది కూడా విధుల్లోకి వెళ్లలేదని జేఏసీ నేత రాజిరెడ్డి పేర్కొన్నారు.  సమ్మెకు పలు వర్గాల మద్దతు కూడగట్టేందుకు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలను కలసి ఆదివారం లేఖలు అందజేయాలని జేఏసీ నిర్ణయించింది. మధ్యాహ్నం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో కార్మిక సంఘాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట బతుకమ్మ ఆడాలని నిర్ణయించారు. సోమవారం ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం వద్ద, జిల్లాల్లో అమరవీరుల స్థూపాలు, గాంధీ విగ్రహాల వద్ద నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు జేఏసీ కన్వీనర్‌ హనుమంతు తెలిపారు.  

విలీనంతో కార్మికులకు ఉద్యోగ భద్రత
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే ఎజెండాగా ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పట్టారు. ఈ మేరకు తమకు కచ్చితమైన హామీ ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు పట్టుబట్టారు. అది కుదరకపోవడంతో సమ్మెబాట పట్టారు. అయితే ఇంతలా కార్మికులకు పట్టెందుకంటే.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం జరిగితే మొదటగా కార్మికులందరికీ ఉద్యోగ భద్రత లభిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement