సాక్షి, హైదరాబాద్: గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు బుధవారం సకల జనుల సమరభేరికి పిలుపునిచ్చారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ సభలో ఆర్టీసీ కార్మికులు, విపక్ష పార్టీల నేతలు భారీ ఎత్తున హాజరయ్యారు. సకల జనుల సమరభేరి సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. విలీనం అంశం తమ మేనిఫెస్టోలో లేదని చెప్తున్న కేసీఆర్ డీజిల్ మీద 27.5 శాతం వ్యాట్ ఎందుకు వేస్తున్నారని.. ఇది మేనిఫెస్టోలో ఉందా అని ప్రశ్నించారు. 20 శాతం బస్సులను ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి.. వాటిని మేఘా కృష్ణారెడ్డికి ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పారా అని చురకలంటించారు. ఆయన మాట్లాడుతూ..
‘విలీనం అంశం తమ మేనిఫెస్టోలో లేదని.. ఊసరవెళ్లి ఎర్రబెల్లి అంటారు. సీఎం కేసీఆర్ కూడా విలీనం అంశం తమ మేనిఫెస్టోలో లేదు అంటారు.. మరి మీ కొడుకు, కూతురు, అల్లుడుకు మంత్రి పదవులు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పారా. 50 వేల కార్మికుల కుటుంబాలకు మద్దతుగా నాలుగు కోట్ల తెలంగాణ సమాజం మద్దతుగా నిలించింది. ఏ స్వేచ్ఛ కోసం తెలంగాణ ప్రజలు పోరాడారో.. మళ్లీ నేడు అదే స్వేచ్ఛ కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. సకలజనుల సమరభేరికి కోర్టు అనుమతిచ్చి 24 గంటలు గడువకముందే వందల కిలోమీటర్ల నుంచి కార్మిక సోదరులు సరూర్‌నగర్ గ్రౌండ్‌లో కదం తొక్కారు. ఇది తెలంగాణ ప్రజల స్ఫూర్తి’ అని రేవంత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment