
సాక్షి, హైదరాబాద్: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ చేస్తున్న సమ్మెలో భాగంగా ఈ నెల 9న తలపెట్టిన మిలియన్ మార్చ్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జేఏసీ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని, వారి పోరాటాలకు మద్దతు ఇస్తూనే బీజేపీ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. మాజీ ఎంపీలు జి.వివేక్, జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డిలతో ఏర్పాటైన ఆ కమిటీ కార్యాచరణను రూపొందిస్తుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ మూడు సార్లు డెడ్‌లైన్ విధించినా 300 మంది ఆర్టీసీ కార్మికులు కూడా జాయిన్ కాలేదన్నారు. సీఎం వారి ఆదరణను కోల్పోయారని, నైతికంగా సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రం గమనిస్తోందని, ఏ సందర్భంలో ఏం చేయాలో అదే చేస్తుందని చెప్పారు. ఇక పార్టీ సంస్థాగత ఎన్నికలపై పదాధికారులు, జిల్లాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించామని లక్ష్మణ్ తెలిపారు. నెలాఖరుకి పార్టీ మండల, జిల్లా కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని, డిసెంబర్‌లో రాష్ట్ర కమిటీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పారన్నారు. కార్యక్రమంలో ఎంపీ దర్మపురి అరవింద్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment