ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేసే చర్యల్లో భాగంగా శనివారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను తీవ్రతరం చేయనుంది. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సిద్ధమని ప్రకటిస్తూనే సమ్మెను మాత్రం ఆపేది లేదని ప్రకటించింది. బంద్ లో భాగంగా శుక్రవారం 14వ రోజున సమ్మె సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలతో ఆర్టీసీ జేఏసీ హోరెత్తించింది. అన్ని డిపోల వద్ద కార్మికులతో గేట్ మీటింగ్‌లు నిర్వహించింది. వ్యాపారులు కూడా బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని, ఆర్టీసీ పరిరక్షణ కోసం చేస్తున్న బంద్ అయినందున ప్రజలు కూడా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసింది. బంద్‌కు టీఆర్‌ఎస్, మజ్లిస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, ప్రజాసంఘాలు, ఆటో, క్యాబ్ సంఘాలు మద్దతు ఇప్పటికే పలి కాయి. బంద్‌కు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ శనివారం మధ్యాహ్నం లంచ్ అవర్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు జేఏసీ చైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి తెలిపారు.