ఆర్టీసీ సమ్మె : 23న ఓయూలో బహిరంగ సభ | TSRTC Strike JAC Decides To Hold Public Meeting At Osmania University | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె : 23న ఓయూలో బహిరంగ సభ

Published Sat, Oct 19 2019 6:41 PM | Last Updated on Sat, Oct 19 2019 7:17 PM

TSRTC Strike JAC Decides To Hold Public Meeting At Osmania University - Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బంద్‌నకు పిలుపునిచ్చి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు శనివారం బంద్‌లో పాల్గొన్నాయి. చాలా చోట్ల నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి ఇతర జేఏసీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాజకీయ జేసీతో భేటీ..
రేపు (ఆదివారం) ఉదయం 11 గంటలకు రాజకీయ జేఏసీ నాయకులను కలవాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఎంఐఎం నేతలనూ కలవాలని నిశ్చయించారు. అక్టోబర్‌ 23న ఉస్మానియా యూనివర్సీటీలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని జేఏసీ తీర్మానించింది. ఇక ధర్నా కార్యక్రమంలో గాయపడ్డ పోటు రంగారావుని ఆర్టీసీ జేఏసీ నేతలు కలిసి పరామర్శించనున్నారు. నేటితో ఆర్టీసీ కార్మికుల సమ్మె 15 వరోజుకు చేరిన సంగతి తెలిసిందే. 

బంద్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం : అశ్వత్థామ రెడ్డి
‘ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు చేపట్టిన బంద్ సంపూర్ణం అయ్యింది. పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలి. బంద్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం. ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో పడింది. కాలయాపన మంచిది కాదు. ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతోంది. తెలంగాణ ఉద్యమం తరువాత జరిగిన ఉద్యమాల్లో ఇదే పెద్ద ఉద్యమం. ఆర్టీసీని రక్షించండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళతాం. మళ్లీ గవర్నర్ ను కలుస్తాం ఎంఐఎం నేతలను కూడా కలుస్తాం. రేపు రాజకీయ జేఏసీతో సమావేశమవుతాం. ఉద్యమ నాయకుల వేళ్లు తీసినా, తలలు నరికినా ఉద్యమం ఆగదు. తెలంగాణ ఉద్యమంలో కూడా పెట్టని కేసులు ఆర్టీసీ సమ్మెలో మా కార్మికుల పై పెడుతున్నారు’ అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి చెప్పారు.

డబ్బులన్నీ ఎక్కిడికి పోతున్నాయ్‌..
రేపు అన్ని చౌరస్తాల్లో పువ్వులు ఇచ్చి ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరతామని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి అన్నారు. రాజకీయ పార్టీ నేతలతో ఆదివారం సమావేశమైన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. 15 రోజుల నుంచి ఆర్టీసీకి వస్తున్న డబ్బులు ఎక్కడకు పోతున్నాయని జేఏసీ కో కన్వీనర్ వీఎస్‌ రావు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్మికుల వల్లే  రూ.155 కోట్లు నష్టమొచ్చిందని.. ఆర్టీసీ దగ్గర కేవలం రూ.8 కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం ఎలా చెబుతోందని నిలదీశారు. ప్రభుత్వం కచ్చితంగా తమతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement