సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేవరకు నిరశన కొనసాగిస్తానంటూ స్వీయ గృహనిర్బంధం చేసుకున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థాహరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. లోపలి నుంచి గడియపెట్టుకుని కొందరు కార్మికులతో కలిసి నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థారెడ్డిని పోలీసులు ఆదివారం సాయంత్రం చాకచక్యంగా అరెస్టు చేశారు. రెండు రోజుల దీక్షతో ఆయన ఆరోగ్యంగా స్వల్పంగా క్షీణించిందని వైద్యులు ప్రకటించటంతో, ఆయనను వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఆయన దీక్ష నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆయన ఇంటివద్దకు చేరుకుంటుండటం, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో శాంతిభద్రతల పరంగా ఉద్రిక్తతలు నెలకొనే ప్రమాదం ఉండటంతో ఆయన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఆదివారం ఉదయం నుండి ప్రయత్నించారు. కానీ ఆయన తలుపులు గడియ వేసి ఉండటంతో పోలీసులు లోనికి వెళ్లలేకపోయారు. దీక్ష నేపథ్యంలో ఆయన ఉంటున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్ వద్దకు పోలీసులు మీడియా ప్రతినిధులను తప్ప వేరేవారిని అనుమతించటం లేదు. కానీ అరెస్టు చేయాలంటే తలుపులు తీయాల్సి ఉండటంతో ఆదివారం సాయంత్రం వారు రూటు మార్చారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, వివేక్‌లులు వచ్చారు. వారిని అనుమతించటంతో వారు అశ్వత్థామరెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయనను కలిసి బయటకు వచ్చే క్రమంలో పోలీసులు చాకచక్యంగా లోనికి ప్రవేశించారు.
దీంతో అశ్వత్థారెడ్డితోపాటు ఉన్న కార్మికులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని వారించి ఆయనను ఆరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ వైద్యులు వచ్చి పరీక్షించి బీపీ, షుగర్‌లెవల్స్ పెరిగాయని ప్రకటించారు. వెంటనే చికిత్స తీసుకోని పక్షంలో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పోలీసులు ఆరెస్టు చేసినా తన దీక్ష కొనసాగుతుందని, ఆసుపత్రిలో కొనసాగిస్తానని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి మానుకుని చర్చలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు.
అశ్వత్థామరెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా పోలీసులు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేశారని ఆర్టీసీ మహిళా కార్మికులు ఆరోపిస్తున్నారు. 44 రోజులుగా సమ్మె చేస్తున్నామని, తమ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించిన చర్చలకు పిలవాలని, తమ న్యాయమైన 25 డిమాండ్లను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. తమ ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వంలో ఆర్టీసీలో విలీనం అనే అంశాన్ని కూడా తాత్కాలికంగా పక్కన పెట్టామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్టీసీ కార్మికులు తెలిపారు.
కాగా అంతకు ముందు నిరాహారదీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలు వివేక్, జితేందర్ రెడ్డి, రామచంద్రరావు తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులతో వివేక్, జితేందర్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. అశ్వత్థామరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన తమను ఎందుకు లోపలకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment