
సాక్షి, అమరావతి : ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుతో జేఏసీ నేతలు మంగళవారం జరిపిన చర్చలు ముగిశాయి. ఈ చర్చలు ఫలప్రదంగా సాగినట్టు తెలుస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మొదటి కేబినెట్ సమావేశంలో ప్రకటించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.
సానుకూల వాతావరణం లోనే చర్చలు జరిగాయని, మొత్తం 26 అంశాలపై ఎంవోయూ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పీ. దామోదరరావు తెలిపారు. ఆర్థికపరమైన అంశాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తాము చేసిన 27 డిమాండ్లలో 26 డిమాండ్లకు ఆర్టీసీ యాజమాన్యం సానుకూల స్పందించిందని, ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకునే డిమాండ్ ఒక్కటే మిగిలి ఉందని తెలిపారు. ఈ రోజు తప్పనిసరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలుస్తామని, ఆయనను కలిసిన అనంతరం సమ్మెపై ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. ఆర్టీసీ హౌస్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు జేఏసీ నాయకులు ఎండీని కలిసి.. చర్చలు కొనసాగించారు. నిన్న అర్థరాత్రి వరకూ ఎండీ సురేంద్రబాబుతో జరిగిన చర్చలు సమస్యల పరిష్కార దిశగా సాగిన సంగతి తెలిసందే. 90శాతం వరకూ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా ఉందని జేఏసీ నాయకులు తెలిపారు.