సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చింది. డిమాండ్ల పరిష్కారం కోసం 18 వరోజూ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిల పక్షం వంటా వార్పునకు పిలుపు నిచ్చింది. సికింద్రాబాద్‌లోని జేబీఎస్ వద్ద ఆర్టీసీ జేఏసీ, రాజకీయ జేఏసీ నేతలు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకోవైపు ఆర్టీసీ సమ్మె విద్యార్థులు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. బస్సుల కొరత కారణంగా వారు నానా పాట్లు పడుతున్నారు.
కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత
ఆర్టీసీ కార్మికుల సమ్మె కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. సమ్మెలో భాగంగా కార్మికులు వేకువజామునే కరీంనగర్ బస్ స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. పార్కింగ్ స్థలంలో ఉన్న ఆర్టీసీ అద్దె బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో అద్దం ద్వంసమయింది. సమ్మెకు సహకరించాలని బస్సులు నడిపే తాత్కాలిక డ్రైవర్‌లను కార్మికులు కోరారు. బస్ స్టేషన్‌లో ఉన్న బస్సును డిపోలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు బస్సులు బయటికి వెళ్లకుండా నిలిచిపోయాయి. బస్సులను అడ్డుకున్న జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీతాలు లేక న్యాయమైన డిమాండ్ కోసం కార్మికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని నేతలు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment