సాక్షి, హైదరాబాద్: దసరా పండుగను సొంతూళ్లలో జరుపుకునేందుకు లక్షలాది మంది ప్రయాణాలకు సిద్ధమైన వేళ.. బస్సులన్నీ కిటకిటలాడుతూ సీట్లు దొరకని పరిస్థితి.. ఇలాంటి సమయంలో తెలంగాణ ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా బస్సు టికెట్లు రిజర్వేషన్ చేయించుకునేందుకు సిద్ధపడిన వారికి కంప్యూటర్ స్క్రీన్‌పై ‘అనేబుల్ టు కనెక్ట్’అన్న పదాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో చాలా మంది ఏపీఎస్ ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో టికెట్లు తీసుకున్నారు. సాధారణంగా ఆర్టీసీకి ఏడాది పొడవునా వచ్చే ఆదాయం ఒక ఎత్తయితే, దసరా లాంటి రద్దీ వేళల్లో వచ్చే ఆదాయం మరో ఎత్తు. ఈ రద్దీ సమయాన్ని ‘క్యాష్’చేసుకునేందుకు ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇలాంటి వేళ ఉన్నట్టుండి తెలంగాణ ఆర్టీసీ సర్వర్ చేతులెత్తేస్తోంది. గత ఏడాది దసరా.. దీపావళి.. సంక్రాంతి సమయాల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ ప్రభావం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ కిందిస్థాయి అధికారులే ఇలాంటి ఆరోపణలు చేస్తుండటం విశేషం.
గురువారం ఉదయం నుంచే ఫిర్యాదులు
గురువారం వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ అధికారులు సర్వర్ పనిచేయడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా సాయంత్రం పొద్దుపోయే వరకు పరిస్థితిలో మార్పు రాలేదు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనా అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్ పనిచేయలేదు. గతానుభవాల నేపథ్యంలో కూడా సమస్య పునరావృతం కావటాన్ని చూస్తే కొందరు కావాలనే సర్వర్‌ను పనిచేయకుండా చేస్తున్నారన్న అనుమానాలకు తావిస్తోంది. గత సంక్రాంతి సమయంలో మూడు రోజుల పాటు ‘దిస్ సైట్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్’అని స్క్రీన్‌పై కనిపించింది. దీంతో ఆ మూడు రోజులు తెలంగాణ ఆర్టీసీ ఆన్‌లైన్ రిజర్వేషన్ నిలిచిపోయింది. ఫలితంగా పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. గురువారం కూడా అదే పరిస్థితి కనిపించింది. ఆర్టీసీ బస్సు ఎక్కాల్సిన ప్రయాణికులను తమవైపు తిప్పుకునే క్రమంలో ప్రైవేటు ఆపరేటర్లు కుట్ర చేసి ఉంటారనే అనుమానాలను కొందరు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రద్దీ ఎక్కువ ఉండటం వల్ల సమస్య తలెత్తిందన్న ఉన్నతాధికారుల మాటలతో వారు ఏకీభవించటం లేదు. అలాంటప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ సర్వర్‌లు కూడా షట్‌డౌన్ కావాలి కదా అని వారు ప్రశ్నిస్తున్నారు.
దసరా రద్దీ వేళ.. సర్వర్ డౌన్
Published Fri, Sep 29 2017 1:57 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement
Advertisement