ఆర్టీసీలో ఉమ్మడి పాలక మండలి
♦ తెలంగాణ బోర్డు ఏర్పాటుకు అనుమతించని కేంద్రం
♦ ఏపీ అధీనంలోని బోర్డులోకి తెలంగాణ సభ్యులు
♦ రవాణా, ఆర్థిక, కార్మిక శాఖల కార్యదర్శులు, ఆర్టీసీ జేఎండీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: పాలనాపరంగా తెలంగాణ, ఏపీ ఆర్టీసీలు వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నా... మరికొంతకాలం పాటు ఒకే ‘పాలక మండలి’ కింద పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్తులు, అప్పుల విభజన సహా సాంకేతికంగా విడిపోయే వరకూ కూడా ఒకే పాలకమండలి ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సాంకేతికంగా ఈ రెండు రవాణా సంస్థలు ఇప్పటికీ ఒకటిగానే కొనసాగుతున్నాయి. బస్సుల నిర్వహణ, ఆదాయ వ్యయాలు వేటికవేగా ఉన్నా... ఆస్తులు-అప్పుల విభజన పూర్తికాలేదు.
ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. అయితే ఈ అంశం తేలకున్నా ఇప్పుడే విడివిడిగా పాలక మండళ్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతివ్వాలన్న తెలంగాణ అభ్యర్థనను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ పరిధిలో ఉన్న పాలకమండలిలో తెలంగాణ రాష్ట్రం సభ్యులను నియమించేందుకు సిద్ధమైంది. తెలంగాణ పక్షాన ఐదుగురు సభ్యులను ప్రభుత్వం నియమించబోతోంది. రవాణా శాఖ, ఆర్థిక శాఖ, కార్మిక ఉపాధి కల్పన శాఖల కార్యదర్శులు, టీఎస్‌ఆర్టీసీ జేఎండీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇక ఇప్పటివరకు పదిమంది సభ్యులు ఏపీ నుంచి ఉండగా ఆ సంఖ్య ఎనిమిదికి తగ్గనుంది. ఈ బోర్డుకు ఏపీ రవాణాసంస్థ ఎండీ చైర్మన్‌గా ఉంటారు.
చైర్మన్ వస్తే ఎలా..?
ప్రసుతం పాలకవర్గాలను నియమించేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీకి కూడా చైర్మన్‌ను నియమించాలని భావిస్తోంది. మిగతా కార్పొరేషన్లతోపాటు ఆర్టీసీ చైర్మన్ పోస్టును భర్తీ చేస్తే కొత్త సమస్య రావటం ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా కార్పొరేషన్ చైర్మన్ పాలకమండలికి నేతృత్వం వహిస్తారు. సాంకేతికంగా ఆర్టీసీ విడిపోనందున... తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ ఉమ్మడి బోర్డుకు నేతృత్వం వహించే అవకాశం ఉండదు. అప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ హోదాలో ఎండీ దాన్ని నిర్వహిస్తే తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ దానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోమారు బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలి. కానీ 2014 అక్టోబరు తర్వాత బోర్డు సమావేశం కాలేదు. తెలంగాణ నేతలు, ఏపీ ఎండీ మధ్య అప్పట్లో తీవ్ర విభేదాలుండటంతో ఈ సమావేశాలు జరగలేదు.
కానీ బోర్డు చేసిన ఓ తీర్మానం సమావేశాలు జరగకున్నా న్యాయపరమైన చిక్కులు లేకుండా చేసింది. చైర్మన్ లేని సమయంలో ఆర్టీసీ ఎండీ ఆ బాధ్యతను నిర్వహించేందుకు వెసులుబాటు కల్పిస్తూ తీర్మానించింది. ప్రస్తుతం కీలక నిర్ణయాలను కూడా బోర్డుతో సంబంధం లేకుండా ఎండీలే కానిచ్చేస్తున్నారు. నిజానికి తెలంగాణ ఆర్టీసీకి ఎండీ లేనట్టే. సాంకేతికంగా ఏపీ ఎండీనే తెలంగాణ-ఆంధ్రలకు చైర్మన్‌గా వ్యవహరించాలి. కానీ టీఎస్ ఆర్టీసీ జేఎండీగా రమణారావును నియమించిన తరుణంలో ఆయనకు ఎండీ అధికారాలను కూడా కట్టబె ట్టడంతో ఆయన ఎండీ హోదాలో చైర్మన్‌తో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి బోర్డులో తెలంగాణ సభ్యులను నియమించబోతున్నందున బోర్డు సమావేశమయ్యే అవకాశం ఉంది.