అంతర్రాష్ట్ర సర్వీసులతో ఆర్టీసీకి అదనపు ఆదాయం
- రోజూ సగటున రూ.1.10 కోట్ల మేర పెరిగిన రాబడి
- డిసెంబర్ నాటికి మరో 200 కొత్త సర్వీసులు ప్రారంభం
- వార్షికాదాయం రూ.900 కోట్ల మేర పెరుగుతుందని అంచనా
- ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లకు భారీగా సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర పర్మిట్లు, సర్వీసులను పట్టించుకోకుండా ఇంతకాలం భారీగా ఆదాయాన్ని చేజార్చుకున్న తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పుడు ‘కొత్తబాట’పట్టింది. డిమాండ్ ఉన్న అన్ని అంతర్రాష్ట్ర మార్గాల్లో బస్సు సర్వీసులు నిర్వహించడంపై దృష్టి పెట్టింది. దాదాపు నాలుగు నెలలుగా చేసిన కసరత్తుతో ఏకంగా 10% ఆదాయాన్ని పెంచుకుంది. రోజుకు సగటున రూ.1.10 కోట్ల అదనపు రాబడిని అందుకుంటోంది. ఈ అదనపు రాబడిని డిసెంబర్ నాటికి రూ.2.50 కోట్లకు పెంచుకునే దిశగా మరిన్ని అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తంగా వార్షికాదాయం రూ.900 కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తోంది.
ఇంతకాలం ఏపీ ఆర్టీసీ దూకుడు
ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీ రెండుగా విడిపోయిన తర్వాత ఏపీ ఆర్టీసీ దూకుడుగా వ్యవహరించింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని ప్రధాన ప్రాంతాలకు విస్తృతంగా బస్సు సర్వీసులు నిర్వహిస్తూ ఆదాయం పొందింది. అదే సమయంలో టీఆర్టీసీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. బాగా డిమాండ్ ఉండే మార్గాలైన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి చోట్లకూ నామమాత్రంగా సర్వీసులు నిర్వహించింది. ఇటీవల ఆర్టీసీ పరిస్థితి మరింతగా దిగజారుతుండటంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఏపీ సహా ఇతర పొరుగు రాష్ట్రా ల్లోని పట్టణాలు, డిమాండ్ ఉన్న మార్గాల్లో అంతర్రాష్ట్ర సర్వీసులను మొదలుపెట్టారు.
ఏపీలోని విజయవాడ, తిరుపతి, వైజాగ్, గుంటూరు, శ్రీశైలం, ఒంగోలు, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, కర్నూలు, పులివెందుల, పోలవరం, పుట్టపర్తి, ఆదోని, అనంతపురం, ఉదయగిరి, తాడిపత్రి, వింజమూరు, మచిలీప ట్నం, నంద్యాల, నెల్లూరు, పలమనేరు, చిలకలూరిపేట.. ఇలా అన్ని ప్రధాన ప్రాంతాలకు కొత్త సర్వీసులు మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా ఆర్టీసీ ఆదాయం పెరిగింది.
ఇతర పొరుగు రాష్ట్రాలకు కూడా..
మరోవైపు కొత్తగా డిమాండ్ ఉన్న మార్గాలపై (రూట్) సర్వే చేసిన ఆర్టీసీ అధికారులు... మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు కూడా బస్సు సర్వీసులు ప్రారంభించారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు బస్సు సౌకర్యం లేదు. దాంతో ప్రయాణికులు ఏపీ బస్సులపై ఆధారపడేవారు. తాజాగా హైదరాబాద్ నుంచి రాయ్‌పూర్‌కు ప్రతిరోజూ నడిచేలా గరుడ ప్లస్ సర్వీసు ప్రారంభించారు.
దానికి మంచి ఆదరణ రావటంతో... తాండూరు నుంచి హైదరాబాద్ మీదుగా దంతెవాడ డీలక్స్ బస్సు సర్వీసు ప్రారంభించారు. హన్మకొండ నుంచి మహారాష్ట్రలోని సిరోంచకు రోజు ఎనిమిది బస్సు సర్వీసులు మొదలుపెట్టారు. ఇక బెంగళూరుకు నడిపే సూపర్ లగ్జరీ బస్సుల స్థానంలో కొత్తగా ఏడు రాజధాని ఏసీ బస్సులను ప్రవేశపెట్టారు. ఇక మహారాష్ట్రలోని పండరీపూర్, అమరావతి, బారామతి, చంద్రాపూర్, వార్ధా, సతారాలకు సర్వీసులు నడపటంతోపాటు నాగ్‌పూర్‌కు మరిన్ని గరుడ ప్లస్ బస్సు సర్వీసులు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పాతబడిన 25 గరుడ బస్సు లను మార్చి కొత్తవి తీసుకోనున్నారు.
నాలుగు నెలల్లో 122 కోట్లు
‘‘అంతర్రాష్ట్ర అదనపు సర్వీసులతో కేవలం నాలుగు నెలల్లో రూ.122 కోట్ల అదనపు ఆదాయం సాధించాం. ఇది ఇక్కడితో ఆగదు. ఒక్క ఏపీకే కొత్తగా మరో 150 బస్సులు నడపాలని నిర్ణయించాం. ఇవి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లకు సర్వీసులు విస్తరిస్తాం. డిమాండ్ ఉన్న అన్ని ప్రాంతాలకు నడుపుతాం. ఇందుకోసం కొత్త బస్సులు సమకూర్చుకుంటున్నాం. మెరుగైన సేవల కోసం పాత బస్సుల స్థానంలో కొత్తవి తీసుకువస్తున్నాం..’’
– ఆర్టీసీ ఎండీ రమణారావు