ఒకే దూరానికి వేర్వేరు చార్జీలు! | Different charges for same distence | Sakshi
Sakshi News home page

ఒకే దూరానికి వేర్వేరు చార్జీలు!

Published Sat, Oct 24 2015 3:00 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

ఏపీ ప్రభుత్వం బస్సు చార్జీలు పెంచడంతో రెండు రాష్ట్రాల మధ్య తిరిగే టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ చార్జీల విషయంలో గందరగోళం నెలకొంది.

♦ ఏపీ బస్సుచార్జీల పెంపుతో గందరగోళం
♦ తెలంగాణ బస్సుల్లో తక్కువ చార్జి... ఏపీ బస్సుల్లో ఎక్కువ
 
 సాక్షి, హైదరాబాద్:  ఏపీ ప్రభుత్వం బస్సు చార్జీలు పెంచడంతో రెండు రాష్ట్రాల మధ్య తిరిగే టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ చార్జీల విషయంలో గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల రవాణా సంస్థలు ఒకే చార్జీని వసూలు చేస్తూ వచ్చాయి. సరిహద్దు దాటి వెళ్లినా చార్జీలు సమానంగానే ఉన్నాయి. తాజా గా ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంచడంతో పరిస్థితి మారింది. రెండు రాష్ట్రాల మధ్య తిరిగే బస్సులకు సంబంధించి ఏపీ బస్సుల్లో ఎక్కువ, తెలంగాణ బస్సుల్లో తక్కువ చార్జీ ఉండనుంది. తెలంగాణ బస్సుల్లో చార్జీలు తక్కువగా ఉండటంతో వీటిల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు పోటెత్తే పరిస్థితి ఉంది.

ఇదే జరిగితే సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య రవాణా సంస్థ పూర్తిగా విడిపోకపోవడంతో ఇప్పటి వరకు పర్మిట్ లెక్కలు తేల్చలేదు. ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య దూర ప్రాంత సర్వీసుల్లో మూడొంతుల బస్సులు ఏపీఎస్‌ఆర్టీసీ చేతిలోనే ఉండిపోయాయి. తెలంగాణ సర్వీసులు చాలా తక్కువగా ఉన్నాయి. తక్కువ ఉన్న తెలంగాణ సర్వీసులకు ప్రయాణికులు ఎగబడితే.. తమ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు పడిపోతుందని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ గందరగోళం పోవాలంటే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో రేట్లు సవరించాలని వారు ఒత్తిడి చేస్తున్నారు.

 అంతర్రాష్ట ఒప్పందం లేకపోవడంతో..
 సాధారణంగా ఆయా రాష్ట్ర పరిస్థితులకు తగ్గట్లుగా ప్రభుత్వాలు ఆర్టీసీ రేట్లు సవరిస్తుంటాయి. ఒప్పందం ఉంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య తిరిగే బస్సుల్లో ఒకే రకమైన చార్జీలు ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య ఇదే ఒప్పందం ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సులో తెలంగాణ ఆర్టీసీ చార్జీ, కర్ణాటక భూభాగంలోకి రాగానే ఆ రాష్ట్ర చార్జీని రెండు రాష్ట్రాల రవాణా సంస్థలు స్థిరీకరించి వసూలు చేస్తాయి. కానీ ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ మధ్య ఇలాంటి ఒప్పందం లేదు. దీంతో చార్జీలను సమం చేసే పరిస్థితి లేనందున ఏపీఎస్‌ఆర్టీసీలో ఎక్కువ చార్జీ, తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో తక్కువ చార్జీ వసూలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement