RTC MD ramana rao
-
‘మెట్రోకు అనుగుణంగా సిటీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఆర్టీసీ ముఖచిత్రం మారనుంది. మెట్రో రైలు మార్గానికి అనుగుణంగా సిటీ బస్సుల విస్తరణకు ఆర్టీసీ కసరత్తు చేపట్టింది. నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు, మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు మొత్తం 30 కిలోమీటర్ల మెట్రో మార్గానికి అనుగుణంగా సిటీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. మెట్రో కారిడార్ రెండు మార్గాల్లో ప్రస్తుతం 23 మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడున్న ప్రయాణికుల్లో సగానికి పైగా మెట్రో వైపు మళ్లే అవకాశం ఉంది. ప్రధాన రూట్లలోనే మెట్రో రానున్న దృష్ట్యా దానికి రెండు వైపులా ఉన్న సుమారు 1,000 కాలనీలను లక్ష్యంగా చేసుకుని ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. సమాంతర మార్గాల స్థానంలో రేడియల్ రూట్లు, ఫీడర్ రూట్లు వినియోగంలోకి రానున్నాయి. ప్రతి ప్రధాన మెట్రో స్టేషన్ నుంచి బస్సులు బయలుదేరి తిరిగి అదే స్టేషన్‌కు చేరుకునే విధంగా నంబర్లలో మార్పులు చేయనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. మెట్రో రాక నేపథ్యంలో ఆర్టీసీలో చేపట్టాల్సిన మార్పులు, కాలనీలకు ఆర్టీసీ సేవల విస్తరణపైన ఎండీ రమణారావు గురువారం జూబ్లీ బస్‌స్టేషన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చలు జరిపారు. బస్టాపుల విస్తరణ.. బస్టాపుల విస్తరణపైన ఆర్టీసీ దృష్టి సారించింది. 23 స్టేషన్లలో ప్రధానమైన వాటిని ఎంపిక చేసి అక్కడి నుంచి బస్సులు రాకపోకలు సాగించే విధంగా బస్‌బేలు, టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల ఆర్టీసీ, మెట్రో, జీహెచ్ఎంసీ తదితర విభాగాలకు చెందిన అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఈ అంశంపైన చర్చించారు. నాగోల్ నుంచి అమీర్‌పేట్, మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ మార్గాల్లో పర్యటించి బస్టాపుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కు, అక్కడి నుంచి జూబ్లీ బస్‌స్టేషన్‌కు రాకపోకలు సాగించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. కాలనీలే లక్ష్యంగా... నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు, మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు ఉన్న మెట్రో కారిడార్‌కు 2 వైపులా సుమారు 1,000 కాలనీలకు బస్సులను నడిపేందుకు చేపట్టాల్సిన చర్యలపై గ్రేటర్ ఆర్టీసీ దృష్టి సారించింది. మెట్రో మార్గానికి అనుగుణంగా రేడియల్, ఫీడర్ రూట్లపైన చర్చించింది. ఆయా కాలనీ సంఘాల ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించాలని ఎండీ రమణారావు సూచించారు. నగర శివార్ల నుంచి ప్రయాణికులను మెట్రో మార్గానికి తరలించేందుకు బస్సుల విస్తరణపై ఆర్టీసీ అధ్యయనం చేపట్టింది. మెట్రో సమాంతర మార్గాల నుంచి ఆర్టీసీ తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొన్న దృష్ట్యా అనుబంధ కాలనీలు, శివార్లే లక్ష్యంగా సేవలను విస్తరించేందుకు దృష్టి సారించింది. ప్రయాణికులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని, వారు కోరిన విధంగా సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని ఎండీ సూచించారు. -
‘గిన్నిస్ రికార్డు’పై ఆర్టీసీ కన్ను
సాక్షి ప్రతినిధి, వరంగల్: జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రికార్డు స్థాయిలో ప్రయాణికులను తరలించి గిన్నిస్ రికార్డు సాధించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సన్నద్ధం అవుతోంది. జాతర సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై వరంగల్‌లో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ రమణారావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర జరిగే నాలుగు రోజుల్లో అత్యధిక రద్దీ ఉండే రోజు 2.61 లక్షల మంది ప్రయాణికులను చేరవేసి గిన్నిస్ రికార్డుకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఒకే రోజు 3,300 బస్సులు వినియోగిస్తామని, గంటకు 450 బస్సులు 11,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయని ఆయన వివరిం చారు. ఇందుకోసం పదివేల మంది ఉద్యోగులు విధుల్లో పాల్గొంటారని చెప్పారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలను కలుపుకుని మొత్తం 23 పాయింట్ల నుంచి మేడారం జాతర వరకు బస్సులు నడపనున్నట్లు చెప్పారు. గత జాతరలో 3,600 బస్సులు వినియోగించామని, ఈసారి జాతరకు 4,000 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, వీటితో పాటు మరో 400 బస్సులు స్పేర్‌లో ఉంచుతామన్నారు. ఈ జాతర సందర్భంగా 40 లక్షల మంది భక్తులకు సేవలు అందివ్వాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ నుంచి మేడారం వరకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యంతో ఏసీ బస్సులు ప్రవేశపెడతామన్నారు. గత జాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.45 కోట్లు కేటాయించిందన్నారు. వజ్ర బస్సులకు ఆదరణ పెరుగుతోందని చెప్పారు. ప్రారంభంలో 50 శాతం ఉన్న ఆక్యుపెన్సీ రేషియో డ్రైవర్లకు ట్యాబ్‌లు ఇచ్చిన తర్వాత 60 శాతానికి పెరిగిందన్నారు. -
అంతర్రాష్ట్ర సర్వీసు ఇక ఆదాయమే బాసు!
అంతర్రాష్ట్ర సర్వీసులతో ఆర్టీసీకి అదనపు ఆదాయం - రోజూ సగటున రూ.1.10 కోట్ల మేర పెరిగిన రాబడి - డిసెంబర్ నాటికి మరో 200 కొత్త సర్వీసులు ప్రారంభం - వార్షికాదాయం రూ.900 కోట్ల మేర పెరుగుతుందని అంచనా - ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లకు భారీగా సర్వీసులు సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర పర్మిట్లు, సర్వీసులను పట్టించుకోకుండా ఇంతకాలం భారీగా ఆదాయాన్ని చేజార్చుకున్న తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పుడు ‘కొత్తబాట’పట్టింది. డిమాండ్ ఉన్న అన్ని అంతర్రాష్ట్ర మార్గాల్లో బస్సు సర్వీసులు నిర్వహించడంపై దృష్టి పెట్టింది. దాదాపు నాలుగు నెలలుగా చేసిన కసరత్తుతో ఏకంగా 10% ఆదాయాన్ని పెంచుకుంది. రోజుకు సగటున రూ.1.10 కోట్ల అదనపు రాబడిని అందుకుంటోంది. ఈ అదనపు రాబడిని డిసెంబర్ నాటికి రూ.2.50 కోట్లకు పెంచుకునే దిశగా మరిన్ని అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తంగా వార్షికాదాయం రూ.900 కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఇంతకాలం ఏపీ ఆర్టీసీ దూకుడు ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీ రెండుగా విడిపోయిన తర్వాత ఏపీ ఆర్టీసీ దూకుడుగా వ్యవహరించింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని ప్రధాన ప్రాంతాలకు విస్తృతంగా బస్సు సర్వీసులు నిర్వహిస్తూ ఆదాయం పొందింది. అదే సమయంలో టీఆర్టీసీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. బాగా డిమాండ్ ఉండే మార్గాలైన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి చోట్లకూ నామమాత్రంగా సర్వీసులు నిర్వహించింది. ఇటీవల ఆర్టీసీ పరిస్థితి మరింతగా దిగజారుతుండటంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఏపీ సహా ఇతర పొరుగు రాష్ట్రా ల్లోని పట్టణాలు, డిమాండ్ ఉన్న మార్గాల్లో అంతర్రాష్ట్ర సర్వీసులను మొదలుపెట్టారు. ఏపీలోని విజయవాడ, తిరుపతి, వైజాగ్, గుంటూరు, శ్రీశైలం, ఒంగోలు, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, కర్నూలు, పులివెందుల, పోలవరం, పుట్టపర్తి, ఆదోని, అనంతపురం, ఉదయగిరి, తాడిపత్రి, వింజమూరు, మచిలీప ట్నం, నంద్యాల, నెల్లూరు, పలమనేరు, చిలకలూరిపేట.. ఇలా అన్ని ప్రధాన ప్రాంతాలకు కొత్త సర్వీసులు మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా ఆర్టీసీ ఆదాయం పెరిగింది. ఇతర పొరుగు రాష్ట్రాలకు కూడా.. మరోవైపు కొత్తగా డిమాండ్ ఉన్న మార్గాలపై (రూట్) సర్వే చేసిన ఆర్టీసీ అధికారులు... మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు కూడా బస్సు సర్వీసులు ప్రారంభించారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు బస్సు సౌకర్యం లేదు. దాంతో ప్రయాణికులు ఏపీ బస్సులపై ఆధారపడేవారు. తాజాగా హైదరాబాద్ నుంచి రాయ్‌పూర్‌కు ప్రతిరోజూ నడిచేలా గరుడ ప్లస్ సర్వీసు ప్రారంభించారు. దానికి మంచి ఆదరణ రావటంతో... తాండూరు నుంచి హైదరాబాద్ మీదుగా దంతెవాడ డీలక్స్ బస్సు సర్వీసు ప్రారంభించారు. హన్మకొండ నుంచి మహారాష్ట్రలోని సిరోంచకు రోజు ఎనిమిది బస్సు సర్వీసులు మొదలుపెట్టారు. ఇక బెంగళూరుకు నడిపే సూపర్ లగ్జరీ బస్సుల స్థానంలో కొత్తగా ఏడు రాజధాని ఏసీ బస్సులను ప్రవేశపెట్టారు. ఇక మహారాష్ట్రలోని పండరీపూర్, అమరావతి, బారామతి, చంద్రాపూర్, వార్ధా, సతారాలకు సర్వీసులు నడపటంతోపాటు నాగ్‌పూర్‌కు మరిన్ని గరుడ ప్లస్ బస్సు సర్వీసులు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పాతబడిన 25 గరుడ బస్సు లను మార్చి కొత్తవి తీసుకోనున్నారు. నాలుగు నెలల్లో 122 కోట్లు ‘‘అంతర్రాష్ట్ర అదనపు సర్వీసులతో కేవలం నాలుగు నెలల్లో రూ.122 కోట్ల అదనపు ఆదాయం సాధించాం. ఇది ఇక్కడితో ఆగదు. ఒక్క ఏపీకే కొత్తగా మరో 150 బస్సులు నడపాలని నిర్ణయించాం. ఇవి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లకు సర్వీసులు విస్తరిస్తాం. డిమాండ్ ఉన్న అన్ని ప్రాంతాలకు నడుపుతాం. ఇందుకోసం కొత్త బస్సులు సమకూర్చుకుంటున్నాం. మెరుగైన సేవల కోసం పాత బస్సుల స్థానంలో కొత్తవి తీసుకువస్తున్నాం..’’ – ఆర్టీసీ ఎండీ రమణారావు -
నగరంలో ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టం!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టం ఏర్పాటవుతున్న తొలిన గరంగా హైదరాబాద్‌కు గుర్తింపు రానుంది. ప్రజా రవాణాలో కీలకంగా ఉన్న ఆర్టీసీ బస్సు ల నిర్వహణను క్రమబద్ధం చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. ప్రజా రవాణా వ్యవస్థను గొప్పగా నిర్వహించటంలో ఫ్రాన్స్ దేశానికి మంచి పేరుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో తొలుత ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసే అవకాశాన్ని ఆ దేశానికి చెందిన లూమీప్లాస్ కంపెనీకి అప్పగించారు. గతేడాది అక్టోబర్‌లో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ రమణారావు ఆ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. బుధవారం ఈ మేరకు నగరంలో ఆర్టీసీ బస్సులకు ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టం ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు నగరానికి వచ్చారు. ప్రయోగాత్మకంగా తొలుత ఓ మార్గాన్ని వారికి అప్పగించారు. అక్కడ తమ సాంకేతిక పరిజ్ఞానంతో దాని అమలును పరిశీలిస్తారు. అది సత్ఫలితాలనిస్తే నగరం మొత్తం ఏర్పాటు చేస్తారు. మొత్తం ఖర్చు ఫ్రాన్స్ కంపెనీదే ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు కోసం ఉప్పల్–కోఠి మార్గాన్ని ఫ్రెంచి కంపెనీ కి అప్పగించారు. ఆ మార్గంలోని 40 బస్సుల్లో దీన్ని ఏర్పాటు చేసి.. అవి తిరిగే బస్టాప్‌లతో అనుసంధానిస్తారు. ఇందుకు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తాన్ని ఫ్రెంచి కంపెనీనే భరి స్తుంది. మరో రెండు నెలల్లో ఈ వ్యవస్థ ప్రారం భమవుతుంది. 6 నెలలపాటు దాని ఫలితాలు పరిశీలిస్తారు. హైదరాబాద్ రోడ్లకు అనుకూలంగా ఉంటే మొత్తం నగరానికి విస్తరి స్తారు. అనుకూలంగా లేనిపక్షంలో.. ప్రయో గం కోసం అయిన ఖర్చుతో ఆర్టీసీకి సంబం ధం ఉండదు. ఇప్పటివరకు దేశంలో ఇలాంటి వ్యవస్థ మరే నగరంలోనూ ఏర్పాటు కాలేదు. దీన్ని మొబైల్ యాప్‌తో అనుసంధానించి అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు కూడా చేస్తు న్నారు. ఆ యాప్ వల్ల వచ్చే అరగంటలో బస్సుల గమనం కచ్చితంగా తెలుసుకునే అవ కాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఫ్రాన్స్‌తో కలసి పనిచేస్తాం: మేయర్ బొంతు రామ్మోహన్ హైదరాబాద్‌లో భూగర్భ పార్కింగ్ ఏర్పా టు, సబ్–వేల నిర్మాణం, గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ల అభివృద్ధికి ఫ్రాన్స్ సహాయం తీసుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. నగరం లో ట్రామ్–వే ఏర్పాటుకు ఫ్రెంచ్ బృందం తో కొద్ది రోజులుగా సమావేశాలు నిర్వ హిస్తున్న విషయాన్ని మేయర్ రామ్మోహన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏంటా పరిజ్ఞానం.. భాగ్యనగరంలో 4 వేల సిటీ బస్సులు తిరుగు తున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకుని ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియని గందరగోళం నెలకొంది. బస్సు కోసం వేచి చూసి ఎప్పుడొస్తుందో తెలియక ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని నివారించి బస్సుల నిర్వహణను జీపీఎస్ పద్ధతితో క్రమబద్ధం చేయడమే ఈ విధానం. బస్సుల్లో జీపీఎస్‌ను ఏర్పాటు చేసి.. బస్టాప్‌లలో అనుసంధాని స్తారు. సౌర శక్తితో పని చేసే డిస్ప్లే బోర్డులను ఏర్పా టు చేస్తారు. ఏ నంబరు బస్సు ఎంత సేపట్లో ఆ బస్టాప్‌నకు వస్తుందో డిస్ప్లే బోర్డుల్లో కనిపిస్తుంది. ఏ బస్సు ఎక్కడుందో మ్యాప్‌లో కనిపిస్తుంది. వచ్చే బస్టాప్ పేరు, ఎంత సేపట్లో అక్కడికి బస్సు చేరుకుంటుందనేది బస్సుల్లో ముందుగా ప్రకటి స్తారు. బస్టాప్‌లలో ఆగకుండా వెళ్లిన బస్సులు, వాటి వేగం, ఎన్ని బస్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఉన్నా యి, ఎన్ని బస్సులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయనే వివరాలన్నీ కంట్రోల్ రూమ్‌లో తెలిసిపోతాయి. పరిశీలించిన మంత్రి మహేందర్‌రెడ్డి సీఎం చంద్రశేఖర్‌రావు విశ్వనగర ఆలోచనకు ఇది ప్రతిరూపమని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నా రు. ఫ్రెంచి కంపెనీ ప్రతినిధులు, ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ ఎంసీ మేయర్ రామ్మోహన్, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఇతర అధికారులతో కలసి బస్‌భవన్‌లో ఆయన ఈ విధానాన్ని పరిశీ లించారు. ఏ బస్సు ఎక్కడుంది.. ఎంత సేపటిలో వస్తుంది.. తదితర కచ్చిత వివ రాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, వచ్చే స్టాపుల వివరాలు ముందే తెలుసుకునే అవకాశం కలుగు తుందని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ఫ్రెంచి ప్రతినిధులు సీఎస్ ఎస్పీ సింగ్‌కు సచివాలయంలో ఈ విధానం గురించి వివరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు ఇలాంటి విధానం చాలా అవసరమని సీఎస్ అభిప్రాయపడ్డారు.