సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఆర్టీసీ ముఖచిత్రం మారనుంది. మెట్రో రైలు మార్గానికి అనుగుణంగా సిటీ బస్సుల విస్తరణకు ఆర్టీసీ కసరత్తు చేపట్టింది. నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు, మియాపూర్ నుంచి ఎస్‌ఆర్ నగర్ వరకు మొత్తం 30 కిలోమీటర్‌ల మెట్రో మార్గానికి అనుగుణంగా సిటీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. మెట్రో కారిడార్ రెండు మార్గాల్లో ప్రస్తుతం 23 మెట్రో స్టేషన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడున్న ప్రయాణికుల్లో సగానికి పైగా మెట్రో వైపు మళ్లే అవకాశం ఉంది.
ప్రధాన రూట్‌లలోనే మెట్రో రానున్న దృష్ట్యా దానికి రెండు వైపులా ఉన్న సుమారు 1,000 కాలనీలను లక్ష్యంగా చేసుకుని ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. సమాంతర మార్గాల స్థానంలో రేడియల్ రూట్‌లు, ఫీడర్ రూట్‌లు వినియోగంలోకి రానున్నాయి. ప్రతి ప్రధాన మెట్రో స్టేషన్ నుంచి బస్సులు బయలుదేరి తిరిగి అదే స్టేషన్‌కు చేరుకునే విధంగా నంబర్లలో మార్పులు చేయనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. మెట్రో రాక నేపథ్యంలో ఆర్టీసీలో చేపట్టాల్సిన మార్పులు, కాలనీలకు ఆర్టీసీ సేవల విస్తరణపైన ఎండీ రమణారావు గురువారం జూబ్లీ బస్‌స్టేషన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చలు జరిపారు.
బస్టాపుల విస్తరణ..
బస్టాపుల విస్తరణపైన ఆర్టీసీ దృష్టి సారించింది. 23 స్టేషన్‌లలో ప్రధానమైన వాటిని ఎంపిక చేసి అక్కడి నుంచి బస్సులు రాకపోకలు సాగించే విధంగా బస్‌బేలు, టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల ఆర్టీసీ, మెట్రో, జీహెచ్‌ఎంసీ తదితర విభాగాలకు చెందిన అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఈ అంశంపైన చర్చించారు. నాగోల్ నుంచి అమీర్‌పేట్, మియాపూర్ నుంచి ఎస్‌ఆర్ నగర్ మార్గాల్లో పర్యటించి బస్టాపుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కు, అక్కడి నుంచి జూబ్లీ బస్‌స్టేషన్‌కు రాకపోకలు సాగించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
కాలనీలే లక్ష్యంగా...
నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు, మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు ఉన్న మెట్రో కారిడార్‌కు 2 వైపులా సుమారు 1,000 కాలనీలకు బస్సులను నడిపేందుకు చేపట్టాల్సిన చర్యలపై గ్రేటర్ ఆర్టీసీ దృష్టి సారించింది. మెట్రో మార్గానికి అనుగుణంగా రేడియల్, ఫీడర్ రూట్‌లపైన చర్చించింది. ఆయా కాలనీ సంఘాల ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించాలని ఎండీ రమణారావు సూచించారు. నగర శివార్ల నుంచి ప్రయాణికులను మెట్రో మార్గానికి తరలించేందుకు బస్సుల విస్తరణపై ఆర్టీసీ అధ్యయనం చేపట్టింది. మెట్రో సమాంతర మార్గాల నుంచి ఆర్టీసీ తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొన్న దృష్ట్యా అనుబంధ కాలనీలు, శివార్లే లక్ష్యంగా సేవలను విస్తరించేందుకు దృష్టి సారించింది. ప్రయాణికులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని, వారు కోరిన విధంగా సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని ఎండీ సూచించారు.
‘మెట్రోకు అనుగుణంగా సిటీ బస్సులు
Published Fri, Oct 13 2017 3:28 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment