
సాక్షి ప్రతినిధి, వరంగల్: జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రికార్డు స్థాయిలో ప్రయాణికులను తరలించి గిన్నిస్ రికార్డు సాధించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సన్నద్ధం అవుతోంది. జాతర సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై వరంగల్‌లో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ రమణారావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర జరిగే నాలుగు రోజుల్లో అత్యధిక రద్దీ ఉండే రోజు 2.61 లక్షల మంది ప్రయాణికులను చేరవేసి గిన్నిస్ రికార్డుకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఒకే రోజు 3,300 బస్సులు వినియోగిస్తామని, గంటకు 450 బస్సులు 11,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయని ఆయన వివరిం చారు. ఇందుకోసం పదివేల మంది ఉద్యోగులు విధుల్లో పాల్గొంటారని చెప్పారు.
తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలను కలుపుకుని మొత్తం 23 పాయింట్ల నుంచి మేడారం జాతర వరకు బస్సులు నడపనున్నట్లు చెప్పారు. గత జాతరలో 3,600 బస్సులు వినియోగించామని, ఈసారి జాతరకు 4,000 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, వీటితో పాటు మరో 400 బస్సులు స్పేర్‌లో ఉంచుతామన్నారు. ఈ జాతర సందర్భంగా 40 లక్షల మంది భక్తులకు సేవలు అందివ్వాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ నుంచి మేడారం వరకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యంతో ఏసీ బస్సులు ప్రవేశపెడతామన్నారు. గత జాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.45 కోట్లు కేటాయించిందన్నారు. వజ్ర బస్సులకు ఆదరణ పెరుగుతోందని చెప్పారు. ప్రారంభంలో 50 శాతం ఉన్న ఆక్యుపెన్సీ రేషియో డ్రైవర్లకు ట్యాబ్‌లు ఇచ్చిన తర్వాత 60 శాతానికి పెరిగిందన్నారు.